ఆర్టీసీ స‌మ్మెపై తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అనుస‌రిస్తున్న వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ మిన‌హా విప‌క్షాలన్నీ...కార్మికుల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, సీఎల్పీ నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టీసీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను భ‌ట్టి త‌ప్పుప‌ట్టారు. కేసీఆర్ గతంలో చెప్పిన హామీలనే కార్మికులు నేడు నెరవేర్చాలని కోరుతున్నారని అన్నారు.  


ఆర్టీసీ అనేది ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఆర్టీసీ ఒకరోజుతో నిర్మించింది కాదని, దశాబ్దాల కష్టంతో వచ్చిన ఆస్తి అని చెప్పారు. ప్రజల ఆస్తులు, ప్రజల రూట్లు ప్రైవేటికరణ చేసేందుకు కేసీఆర్ ఎవరు అని  భట్టి ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యూడలిస్టు భావాలతో పని చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఆయన సొంత ఎస్టేట్ కాదని చెప్పారు. ప్రజలతో అనుబంధం ఉన్న రూట్లను ప్రైవేటీకరణ చేయడం అంటే అమ్మడం అన్నట్లేనని అన్నారు.ఆర్టీసీపై ఏ నిర్ణయం అయినా చట్ట సభల్లో చర్చలు జరపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కార్మికుల మరణాలకు ప్రతిపక్షాలు కారణం కాదని, ప్రభుత్వమే కారణమని ఆయ‌న ఆరోపించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని భట్టి విక్రమార్క సూచించారు. 


మంచి పాలన ఇవ్వాలని కేసీఆర్ కి ప్రజలు అధికారం ఇస్తే, దాన్ని ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నారని భ‌ట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ ఆర్టీసీ సర్కారు తీరుతోనే ఆరేండ్లలో దివాలా తీసిందని అన్నారు. సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఉందని భట్టి ఆరోపించారు. ఇవాళ ఆర్టీసీ, రేపు సింగరేణి.. ఇలా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టేలా ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: