ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించ‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్  బహిరంగ సభలో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే  ఇసుక కొరత ఏర్పడిందని...భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం వల్ల 26 మంది చనిపోవడం బాధగా ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులను కాపాడుకోలేక పోతే జీవిత రథ చక్రాలు ఆగిపోతాయన్నారు.ఆరు నెలల్లోనే  వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... జగన్ సరిగా పాలిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటానన్నారు. 


నాయకులు బాధ్యతాయుతంగా పాలిస్తే తాను జనసేన పార్టీని పెట్టేవాడిని కాదని ప‌వ‌న్ తెలిపారు. జగన్‌కు రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడే దమ్ము లేకపోయిందని అయితే, తెలంగాణ నడిబొడ్డున ఉద్యమం గురించి మాట్లాడాను కాబట్టే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు తనను నమ్మారని పవన్ తెలిపారు.ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాపీ పనులు చేసుకునే వ్యక్తులు ఆ పనులు లేక పస్తులు ఉంటున్నారని, కార్మికులు రోడ్డున ప‌డ్డార‌ని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు రోడ్లపైకి వస్తే ప్రభుత్వం విఫలమైనట్టేనన్నారు. భీమవరం,గాజువాకలో ఓడినంత మాత్రానా తాము విఫలమైనట్టు కాదన్నారు. పార్టీని నడపాలంటే కోట్లు అవసరం లేదు.. భావజాలం చాలు అని తెలిపారు. ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం కంటే పదవులు ఎక్కువ కాదన్నారు. తాను టీడీపీకి దత్తత పుత్రుడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ప్రజలకు తప్ప ఎవరికీ దత్తత పుత్రుడని అన్నారు. 


రెండు వారాల గ‌డువు ప్ర‌భుత్వానికి ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...కార్మికుల‌కు వారి ద్వారా సేకూరిన మొత్తం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. త‌న పోరాటాన్ని ఆపేందుకు పోలీసులు కాదు అవ‌స‌ర‌మైతే ఆర్మీని సైతం అండ‌గా పెట్టుకోవ‌చ్చున‌ని ప‌వ‌న్ కోరారు. కూల్చివేత‌ల‌తో ప్ర‌భుత్వాన్ని మొద‌లుపెట్టార‌ని...అలాంటి ప్ర‌భుత్వం కూలిపోక త‌ప్ప‌ద‌ని అన్నారు. క‌డ‌ప సిద్ధాంతం గురించి చెప్ప‌లేద‌ని...ప్ర‌జ‌ల సిద్ధాంతం గురించి చెప్తున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: