ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఊహించ‌ని ప్ర‌తిపాద‌న‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. గ‌త నెల రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్ప‌టివ‌ర‌కు అన్ని పార్టీలు సంఘీభావం తెలుప‌డంతో పాటుగా ఆందోళ‌న‌ల్లో పాల్గొన‌గా...ఎంఐఎం త‌న వైఖ‌రి ఏంటో వెల్ల‌డించ‌ని సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆయ‌న రెస్పాండ్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు.. ఉద్యోగాల్లో చేరండి అని కార్మికుల‌కు ఓవైసీ పిలుపునిచ్చారు. ఆర్టీసీ విషయంలో ఏర్పడిన సందిగ్ధం త్వరలోనే తొలగిపోతుందని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు.


ఆర్టీసీ కార్మికులు నవంబరు 5 లోపు విధుల్లో చేరొచ్చని, ఇదే చివరి అవకాశమ‌ని సీఎం కేసీఆర్ శనివారం రాత్రి ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.కేసీఆర్  ఈ ప్ర‌క‌ట‌న చేసిన మ‌రుస‌టి రోజు ఒవైసీ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్, బీజేపీ రాజకీయాల కోసం ఆర్టీసీ యూనియన్లను వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఆ పార్టీలను నమ్మొద్దని కోరుతూ...ధుల్లో చేరేందుకు కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ కు ఒప్పుకోవాలని కార్మికులకు సలహా ఇచ్చారు. కార్మికులెవరూ ఆత్మ త్యాగాలకు పాల్పడొద్దని, సమ్మెలో కొందరి ప్రాణాలు పోవడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వంతో కూర్చుని మాట్లాడి సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు.


దీంతో పాటుగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు సైతం ఓవైసీ ఓ రిక్వెస్ట్ చేశారు. 5100 ఆర్టీసీ బస్సు రూట్లను ప్రైవేటు పరం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపైనా ఒవైసీ స్పందిస్తూ...ఆర్టీసీ బస్సుల నంబరు ప్లేట్లపై ఉన్న ‘Z’  అక్షరాన్ని అలానే కొనసాగించాలని కోరారు. హైదరాబాద్ ను పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జహ్రా బేగం పేరు మీద ‘Z’ అక్షరం ఉండ‌టాన్ని పేర్కొంటూ..ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసినా నిజాం తల్లి గుర్తును మాత్రం చెరపొద్దంటూ విజ్ఞప్తి చేశారు.  కాగా,  అస‌దుద్దీన్ ఓవైసీ చేసిన విజ్ఞ‌ప్తిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: