ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నెల 15వ తేదీనుండి వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. సొంత భూమి కలిగిన రైతులకు ఇప్పటికే ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. శనివారం  సాయంత్రం అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 905 మంది కౌలు రైతులు మాత్రమే రైతు భరోసా పథకానికి అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మొదట 15.37 లక్షల మంది  కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆ తరువాత ప్రభుత్వం 3 లక్షలకు లక్ష్యాన్ని తగ్గించింది. కొన్ని జిల్లాల్లో అర్హత సాధించిన కౌలుదార్ల సంఖ్య సున్నాగా ఉంది. వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి ఈ నెల 15వ తేదీ వరకు గడువు పెంచింది. కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో కౌలు రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. కౌలు రైతులు అర్హత పొందలేకపోవటానికి కారణం భూ యజమాని సంతకంతో ముడిపెట్టడమే అని తెలుస్తోంది. 
 
 ఏపీ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు ఎన్ రంగారావు కన్వీనర్ యలమందారావు 11వ తేదీన 13 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో 8వ తేదీన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 
భూమి లేని కౌలు రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా అందించాలని కౌలు రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సీఎం జగన్ తో రాష్ట్ర వ్యవసాయ మిషన్ భేటీలో కానీ ఈ భేటీ కంటే ముందే ఏదైనా సమావేశం జరిగితే ఆ సమావేశంలో కౌలు రైతుల భరోసా అంశం గురించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. కౌలు రైతుల భరోసా విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు, సాంకేతిక సమస్యల గురించి వ్యవసాయ శాఖ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: