ఢిల్లీ ఇప్పుడు దేశ రాజ‌ధాని కంటే...కాలుష్య రాజ‌ధానిగా మారిపోయింది. ఢిల్లీలో పంజా విసురుతున్న కాలుష్య రక్కసికి ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. కాలుష్యంధాటికి తాళలేక ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్‌) చుట్టుపక్కల నివసించే దాదాపు 40 శాతం మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే ఆలోచనలో ఉన్నట్టు నోయిడాకు చెందిన సోషల్‌ మీడియా వేదిక ‘లోకల్‌ సర్కిల్స్‌' చేసిన ఓ సర్వేలో తేలింది. ఢిల్లీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకైనా ఇతర ప్రదేశాలకు వెళ్లి పర్యటించి వస్తామని 16 శాతం మంది ఢిల్లీ వాసులు చెప్పడాన్ని చూస్తే, అక్కడ కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.అయితే, స‌హ‌జంగానే... హైదరాబాద్‌లో కాలుష్యం ఏ స్థాయిలో ఉంది? ఎంత ప్రమాదకరంగా మారుతోందనే ఆస‌క్తి వ్య‌క్త‌మవుతోంది.


జాతీయ ప్రమాణాల ప్రకారం దుమ్ము కణాలు 2.5 మైక్రాన్‌ల పరిణామంలో 40 మైక్రోగ్రామ్స్ ఉండాల్సి ఉండగా.. హైదరాబాద్‌లో 50 మైక్రోగ్రాములుగా ఉన్నది. (గాలిలో క్యూబిక్ మీటర్ పరిధిలో ఎంత దుమ్ము, ధూళి ఉన్నదనే దానిని మైక్రోగ్రామ్స్‌లో కొలుస్తారు) 10 మైక్రాన్ల పరిణామంలో జాతీయ ప్రమాణాలు 60 మైక్రోగ్రాములు కాగా, అది కాస్త 100 మైక్రోగ్రాములుగా ఉన్నది. ఇది ఢిల్లీ నగరంలో అత్యంత ప్రమాదకరంగా 700 నుంచి 994 మైక్రోగ్రాములుగా నమోదవుతున్నది. ఢిల్లీతో పాటుగా...దేశంలో చాలా పట్టణాలు డేంజర్ (రెడ్) జోన్‌లోకి వెళ్లగా.. హైదరాబాద్ మాత్రం గ్రీన్ జోన్‌లోనే ఉంది. జాతీయ గాలి నాణ్యత ప్రమాణాలకంటే మించి కాలుష్యం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీని నియమించి గాలి నాణ్యతను పెంచడానికి ప్రత్యేక డ్రైవ్‌లను చేపడుతోంది. హైదరాబాద్, శివారులోని పటాన్‌చెరులో కాలుష్యం పరిమితిని మించినప్పటికీ ఉత్తరాది పట్టణాలతో పోలిస్తే ఎంతో నయమని అధికారులు విశ్లేషిస్తున్నారు.


తెలంగాణ‌ రాష్ట్రంలో హైదరాబాద్, పటాన్‌చెరు, నల్లగొండలో కాలుష్యం నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్‌కు మించి ఉన్నది. సల్ఫర్ డై ఆక్త్సెడ్, నైట్రోజన్ ఆక్సైడ్ కొన్నిచోట్ల ప్రమాదకరస్థాయిని దాటింది. వాయుకాలుష్యం, దుమ్ముకణాల స్థాయీ జాతీయ ప్రమాణాలను మించింది. ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆరుచోట్ల నిరంతర పరిసరాల వాయునాణ్యతను పర్యవేక్షించే కేంద్రాలను ఏర్పాటుచేసింది. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను గుర్తించడం, 15 ఏళ్ల‌కు పైగా వాడకంలో ఉన్న వాహనాలను బయటకు తీయకుండా నియంత్రించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రోడ్లను విస్తరించడం, ఫ్లై ఓవర్లు, సబ్‌వేల నిర్మాణం వంటి చర్యలు తీసుకుంటోంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంతోపాటు, ట్రాఫిక్ కారిడార్‌లో గ్రీన్ బఫర్ జోన్లను ఏర్పాటుచేసింది. పరిశ్రమల్లో బొగ్గు వాడకం, బహిరంగంగా చెత్త, వ్యర్థ పదార్ధాలను కాల్చడాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి.. భారీ జరిమానాలు విధిస్తోంది. ఈ చర్యలతో నల్లగొండలో గాలి నాణ్యత బాగా పెరిగి సాధారణస్థాయికి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: