ఏపీ ప్రభుత్వం 2020 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి అమ్మఒడి పథకాన్ని అమలు చేయబోతున్న విషయం తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనే ఆశయంతో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని రూపొందించింది. విద్యాశాఖ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు డిసెంబర్ 31వ తేదీ నాటికి 75 శాతం హాజరు ఉంటే మాత్రమే అమ్మఒడి పథకానికి అర్హులని తేల్చి చెప్పింది. 
 
75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతూ ఉండటం పట్ల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులలో అమ్మఒడి పథకానికి అర్హులను తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అమ్మఒడి పథకానికి గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 
 
గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అమ్మఒడి పథకానికి సంబంధించిన వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రామ, వార్డు వాలంటీర్లు వారికి కేటాయించిన ఇళ్లలో చదివే విద్యార్థుల వివరాలు మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన విద్యార్థుల యొక్క తల్లి బ్యాంకు వివరాలను ప్రభుత్వం సేకరించి జనవరి 26వ తేదీన వారి ఖాతాలలో నగదు జమ చేయనుంది. 
 
విద్యార్థికి తల్లి లేకపోతే తండ్రి బ్యాంకు ఖాతా వివరాలను తల్లి తండ్రి ఇద్దరూ లేకపోతే సంరక్షకుని బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి వారి ఖాతాలలో నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకానికి అర్హత పొందాలంటే తెల్ల రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డ్ వివరాలను కూడా రేషన్ కార్డ్ వివరాలతో పాటు ప్రభుత్వం సేకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివేవారికి ఈ పథకం వర్తిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: