‘మహా’నాటకం రక్తికడుతోంది. అధికారం పంచుకునే విషయంలో బీజేపీ, శివసేన పట్టు వీడకపోవడంతో....ఫలితాలు వెలువడి పది రోజులు కావస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత వీడడం లేదు. కాంగ్రెస్‌-ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ కానున్న నేపథ్యంలో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌కు శివసేన నేత సంజయ్‌ రౌత్‌ సందేశం పంపడం...ప‌లు ష‌ర‌తుల‌తో ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంద‌ని ప్ర‌క‌టించ‌డం...క‌ల‌క‌లం సృష్టిస్తోంది.


మ‌హారాష్ట్ర ట్విస్టులు కొలిక్కి వ‌చ్చే ఐదు మార్గాల‌ను...శివ‌సేన నేత వివ‌రించారు. ‘బీజేపీ, శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం మొద‌టి మార్గం. అయితే ముఖ్యమంత్రి పదవిని మాత్రం పంచుకోవాల్సిందే. ఇదే అన్నింటికంటే ఉత్తమమైన మార్గం అయినప్పటికీ, అహంకారం కారణంగా ఇది సాధ్యం కాకపోవచ్చు.  రెండో మార్గం...ది, సుప్రియా సూలేకి కేంద్రంలో, అజిత్‌ పవార్‌కు రాష్ట్రంలో పదవుల హామీతో 2014లో మాదిరిగా బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇవ్వొచ్చు. అయితే 2014లో చేసిన తప్పును శరద్‌ పవార్‌ మళ్లీ చేస్తారనుకోవడం లేదు. ఇక మూడోది, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం. శివసేన ముఖ్యమంత్రి పదవిని చేపడుతుంది. ఇక నాలుగోది, శివసేన లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. కానీ ఆ పార్టీకి ఇంకా 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి, బలపరీక్షలో నెగ్గకపోవచ్చు.  ఇక ఐదోది, దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ఇతర పార్టీలను చీల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. `` అని ఆప్ష‌న్లు ఇచ్చారు.


మ‌రోవైపు, మ‌హారాష్ట్ర సీన్ ఢిల్లీకి మారింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్‌, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో శరద్‌పవార్‌ భేటీ కానుండగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో ఫడ్నవీస్‌ సమావేశం కానున్నారు. ఇదే స‌మ‌యంలో...శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గత నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల సంభవించిన పంట నష్టం గురించి తెలుసుకునేందుకు ఆయన ఆదివారం ఔరంగాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..తమ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది తొందర్లోనే ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. అంతకుమించి రాజకీయ ప్రశ్నలకు స్పందించేందుకు ఆయన నిరాకరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: