తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్‌గా..మ‌రో ముఖ్య నేత వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు. టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు కాషాయ‌కండువా క‌ప్పుకొన్నారు. ఢిల్లీ వెళ్లిన మోత్కుపల్లి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అమిత్ షాను మోత్కుపల్లితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ గరికపాటి మోహన్ రావు, వీరేందర్ గౌడ్ కలిశారు. అనంత‌రం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా మోత్కుపల్లికి కండువాకప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.


కాగా, గ‌త కొద్దికాలంగా మోత్కుప‌ల్లి పొలిటిక‌ల్ ఎంట్రీపై అస్ప‌ష్ట‌త నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేసినా కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇండిపెండెంట్‌గా బ‌రిలో దిగారు. అయితే, ఓట‌మి పాల‌య్యారు.  ప్రస్తుతం రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే ఏదైనా పెద్ద పార్టీ అండ అవసరం. తెలంగాణ పాటిలిక్స్‌ని గమనిస్తే.. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలే ప్రధాన పార్టీలుగా కనిపిస్తున్నాయి. వామపక్షాలతోపాటు చిన్నా చితకా పార్టీలున్నా వాటి ప్రభావం అంతంత మాత్రమే. ఇదే స‌మ‌యంలో...తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అసంతృప్తి నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. మోత్కుపల్లిని బీజేపీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా...ఆయ‌న ఓకే చెప్పేశారు. దీంతో బీజేపీ వేసిన స్కెచ్ ఫలించింది. 


కాగా, అమిత్‌షాను క‌లిసిన అనంత‌రం మోత్కుప‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో నిజాం మెడ‌లు వంచి హైద‌రాబాద్‌ను దేశంలో విలీనం చేసిన ఉక్కుమ‌నిషి స‌ర్దార్ ప‌టేల్ వ‌లే...అమిత్‌షా సైతం కేసీఆర్ ఒంటెద్దు పోక‌డ‌ల‌ను అంతం చేసే ఉక్కుమ‌నిషి అని కొనియాడారు. అమిత్‌షాతో జ‌రిగిన స‌మావేశంలో అనేక రాజ‌కీయ అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని ఈ సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి వివ‌రించారు. పార్టీ కండువా క‌ప్పుకొంటూనే..మోత్కుప‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: