తెలంగాణ రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తహశీల్దార్ కార్యాలయంలోనే మహిళా అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించటంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో పని చేసే తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనమయ్యారు. తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి దారుణమైన ఘటన జరగటంతో సిబ్బంది షాక్ కు గురయ్యారు. తహశీల్దార్ సజీవ దహానానికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. 
 
మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాడి ఘటన తెలిసిన వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ కు బయలుదేరారు. ఎవరికైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులపై దాడులు చేయటం అమానుషమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తహశీల్దార్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని అన్నారు. అధికారులు ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటారని తహశీల్దార్ తో ఏవైనా సమస్యలు ఉంటే పై లెవెల్ అధికారులకు చెప్పాలని అన్నారు. 
 
అధికారుల ప్రాణాలు తీసే దుర్మార్గమైన పద్దతి కరెక్ట్ కాదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ను కలెక్టర్ ను కోరానని మంత్రి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి తహశీల్దార్ విజయ కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. దాడి చేసిన వ్యక్తి పేరు సురేశ్ అని తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
కార్యాలయసిబ్బంది పోలీసులకు ఓ సంచితో లోపలికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీసీపీ సన్ ప్రీత్ సింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. నిందితుడిని ప్రస్తుతం హయత్ నగర్ లోని ఒక ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. తీవ్ర స్థాయిలో సురేశ్ కు గాయాలు కావటంతో వైద్యులు పోలీసులను మాట్లాడటానికి అనుమతించటం లేదని తెలుస్తోంది. పోలీసుల విచారణ తరువాత ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: