ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంను బదిలీ చేశారు.ఈ మేర‌కు జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్టిస్ట్యూట్ డిజీగా ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ బ‌దిలీ త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా, ఈ బ‌దిలీపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 


సీఎస్ కంటే జూనియర్ అయిన సీఎం ముఖ్య కారదర్శి, జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరి ప్రవీణ్ ప్రకాష్ మ‌ధ్య విబేధాలు... సీఎస్ అధికారాలనే సవాల్ చేసిన వైనం ఈ బ‌దిలీకి కార‌ణ‌మ‌ని అంటున్నారు. బిజినెస్ రూల్స్, సీఎస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు మీడియాకెక్కి, చివరకు ప్రవీణ్‌కు షోకాజ్ నోటీసులిచ్చే వరకూ వెళ్లింది. తనను ధిక్కరిస్తూ, బిజినెస్ రూల్స్‌కు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్ర‌వీణ్ ప్రకాష్‌కు, షోకాజ్ నోటీసులివ్వడం ద్వారా.. సీఎస్ ఎల్వీఎస్ తన హోదాకున్న ప్రాధాన్యతను స్పష్టం చేశారు. అయితే, దీనిపై ప్ర‌వీణ్ ప్ర‌కాష్ త‌క్ష‌ణం స్పందించి....సీఎం దృష్టికి తీసుకువెళ్ల‌డం ద్వారా...సీఎస్ ప‌ద‌వికి ఎస‌రు పెట్టార‌ని అంటున్నారు.


కాగా, మ‌రో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి నీర‌భ్‌కుమార్ ప్ర‌సాద్‌కు ఇన్‌చార్జ్ సీఎస్‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ జీవోపై ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం స్పందించాల్సి ఉంది.  ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌కు నోటీసులు ఇచ్చిన ఉదంతంలోనే... ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుందా?  లేదా మ‌రేదైనా కార‌ణాలు ఉన్నాయా అనేది వెల్ల‌డ‌వ్వాల్సి ఉంది. మ‌రోవైపు, ఈ నిర్ణ‌యం వెనుక ఆయా రాజ‌కీయ ప‌క్షాలు, వివిధ వ‌ర్గాలు చేసిన విమ‌ర్శ‌లు ఏమైనా కార‌ణ‌మా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా... ఏపీ సీఎస్ బ‌దిలీ ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా  మారిందని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


 


 


మరింత సమాచారం తెలుసుకోండి: