తహశీల్దార్ విజయకు దాదాపు ఒంటి గంట సమయంలో నిందితుడు సురేశ్ నిప్పంటించాడని పోలీసులు చెబుతున్నారు. పాస్ బుక్ వివాదం వలన సురేశ్ ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. తహశీల్దార్ కు నిప్పంటించిన సమయంలోనే సురేశ్ కు కూడా మంటలు అంటుకున్నాయని దాడి తరువాత సురేశ్ నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు  వెళ్లి లొంగిపోయాడని తెలుస్తోంది. 
 
పోలీసులు ప్రస్తుతం సురేశ్ ను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్ కు బాచారంలో ఏడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోందని ఈ భూమి ఒక వివాదంలో ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు నిందితుడిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగేలా చూస్తామని పోలీసులు చెబుతున్నారు. 
 
తహశీల్దార్ ను కాపాడే ప్రయత్నం చేసిన సిబ్బందికి గాయాలయ్యాయి. సురేశ్ ఒక రైతు అని పట్టా వివాదం విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. భూ వివాదం కారణంగానే సురేశ్ తహశీల్దార్ పై దాడి చేశాడా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. 
 
సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ నిందితుడికి ఉరిశిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. లైటర్ తో విజయారెడ్డికి నిప్పంటించాడని నిందితుడు సురేశ్ పోలీస్ స్టేషన్ వరకూ వచ్చి పోలీస్ స్టేషన్ బయట పడిపోయాడని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. నిందితుడు సురేశ్ స్పృహలోకి వస్తే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. తహశీల్దార్ పై నిందితుడు పోసింది పెట్రోలా లేక కిరోసినా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: