ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస‌పాత్ర‌డిగా పేరు తెచ్చుకున్న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బ్రాహ్మణ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంపై ప్ర‌భుత్వం బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న‌ను ఏకంగా ఎలాంటి పెద్ద ప్రాధ‌న్యం లేని ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇని స్ట్యూట్ డిజీ గా బదిలీ చేసింది. అయితే, ఇలా ఇంత అక‌స్మాత్తుగా , ఉరుములు మెరుపులు లేకుండా జ‌రిగిన‌ బ‌దిలీ వెనుక ఉన్న రీజ‌న్ ఏంటి? ఏం జ‌రిగింది? అస‌లు ఈ బ‌దిలీ ద్వారా జ‌గ‌న్ స‌ర్కారు ఉన్న‌తాధికారుల‌కు పంపిన సంకేతాలు ఏంటి? అనే విష‌యాలు పెద్ద ఎత్తున చర్చ‌కు వ‌స్తున్నాయి.


విష‌యంలోకి వెళ్తే.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే సీనియార్టీ ఆధారంగా ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని సీఎస్‌గా ఎంపిక చేసింది. ఎన్నిక‌ల  కాలంతో క‌లుపుకొంటే.. ఈ అత్యున్న‌త ప‌ద‌విలో ఎల్వీ కేవ‌లం 7 మాసాలు మాత్ర‌మే ఉన్నారు. దీనికి ముందు సీఎస్‌గా వ్య‌వ‌హ‌రించిన అనిల్ చంద్ర పునేఠా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన ఆదేశాల‌ను అమ‌లు చేయ‌లేదు. పైగా ఆ ఆదేశాల‌ను హైకోర్టులో స‌వాలు చేశారు. దీనిపై చిర్రెత్తిన ఎన్నిక‌ల సంఘం నేరుగా ఆయ‌న‌ను ఢిల్లీకి పిలిపించి.. క్లాస్ పీక‌డంతోపాటు .. ప‌ద‌వి నుంచి రాత్రికి రాత్రి ప‌క్క‌న పెట్టింది.


అయితే, పునేఠా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డానికి కొన్ని వారాల ముందు జ‌రిగిన ఈ ప‌రిణామం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఎన్నిక‌ల స‌మయంలో సీఎంగా చంద్ర‌బాబు ఉండ‌డంతో ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేశార‌నే అపవాదును కూడా పునేఠా మోయాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈసీ ఆదేశాల‌తో ఎల్వీ సీఎస్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించి, ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత కొలువుదీరిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం సీఎస్‌ను మార్చుకునే వెసులుబాటు ఉన్న‌ప్ప‌టికీ.. ఎల్వీని కొన‌సాగించింది.


తాజాగా.. జ‌గ‌న్ త‌న వ్య‌క్తిగత కార్య‌ద‌ర్శిగా సీనియ‌ర్ ఐఏఎస్‌.. ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌ను తెచ్చుకున్నారు. ఈయ‌న సీఎస్ కింద ప‌నిచేయాల్సి ఉంది. కానీ, ఈయ‌న తాజాగా కొన్ని రోజుల కింద‌ట జారీ చేసిన ఓ జీవో.. సీఎస్ ఎల్వీకి, ప్ర‌వీణ్‌కు మ‌ధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. స‌ర్వీస్ రూల్స్‌ను కాల‌రాస్తూ.. ప్ర‌వీణ్ ఇచ్చిన జీవోను ఎల్వీ ప్ర‌శ్నించారు. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా కూడా రంగు పులుముకొంది. జ‌గ‌న్ వైఖ‌రి కార‌ణంగానే ఉన్న‌తాధికారుల్లో విభేదాలు మొద‌ల‌య్యాయ‌ని అప్పుడే టీడీపీ విమ‌ర్శ‌లు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఎల్వీ బ‌దిలీ మ‌రింత సంచ‌ల‌నంగా మారాయి.


ఇదిలావుంటే, ఈ బ‌దిలీ ప‌లు సంకేతాల‌ను పంపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అధికారులు స‌మ‌య‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే జ‌గ‌న్ హెచ్చ‌రించారు. అయితే, అటు ప్ర‌వీణ్‌, ఇటు సీఎస్ స్థానంలో ఉన్న ఎల్వీ కూడా వివాదాల‌కు తెర‌దీశారు. జ‌గ‌న్ ఆవెంట‌నే ఎల్వీని ప‌క్క‌న పెట్టారు. దీనిని బ‌ట్టి ప్ర‌భుత్వ విధానాలు, సీఎం జ‌గ‌న్ సూచ‌న‌ల‌ను పాటించ‌ని వారు ఎంత‌టివారైనా వేటు త‌ప్ప‌ద‌నే సంకేతాలు తాజా బ‌దిలీతో వ‌చ్చిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: