ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి రాజ‌కీయ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. తనను తాను నిలబెట్టుకోవడంతో పాటు పార్టీని నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు విస్తృతంగా తిరుగుతున్నారు. నేతలు దూరమైనా సరే నేను ఉన్నాను అంటూ భయపడుతున్న కార్యకర్తలకు ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నవ్వుతూ ప్రసంగాలు చేస్తూ తన అనుకూల మీడియాలో పదే పదే కనపడే ప్రయత్నం చేస్తున్నారు. తన 40 ఏళ్ళ అనుభవంతో పార్టీని బ్రతికించే ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇక రాష్ట్ర పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ చంద్రబాబు చేస్తున్న పర్యటనలు నేతల్లో ఏ మాత్రం జోష్ నింపుతున్నాయో తెలియదు గాని ఆ పార్టీలో కొంత మందిలో మాత్రం చికాకు తెప్పిస్తున్నాయి. నెలకు రెండు సార్లు విజయవాడ పిలవడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే నేతలు చుక్కలు చూస్తున్నారు. ఎక్కడో అనంతపురం నుంచి, ఎక్కడో శ్రీకాకుళం నుంచి రావాలి అంటే ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం నేతలతో, సమావేశాలు నిర్వహించిన ఆయన మళ్ళీ వారిని సమావేశాలకు అంటూ విజయవాడ పిలిచారు.


దీని వల్ల‌ ప్రయోజనం ఏమో గాని నేతలు మాత్రం అక్కడ కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారు. భోజన సమయానికి ఆ వంక పెట్టుకుని సగం మంది నేతలు బయటపడి వెళ్ళిపోతున్నారు. పరిటాల శ్రీరాం, జేసి పవన్, అఖిల ప్రియ వంటి నేతలు అసలు కనపడలేదు. దూరం నుంచి వచ్చే నేతలు అయితే ఇప్పుడు ఎక్కడ వెళ్తాం లే అనుకుని దూరంగా ఉంటున్నారు. ఈ విధంగా చంద్రబాబు వాళ్ళలో ఉత్సాహం నింపడం ఏమో గాని విసుగు తెప్పిస్తున్నారు అనే అభిప్రాయం వినపడుతుంది. చంద్రబాబు ప్రసంగించే సమయంలో కూడా కొందరు నేతలు బయటకు వచ్చేయడం ఇప్పుడు కార్యకర్తల్లోనే అసహనానికి దారి తీసింద‌ని టీడీపీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: