అదేంటో జగన్ అధికారంలోకి రావడం  ప్రతిపక్షం అసలు ఇష్టం లేనట్లుగా ఉంది. జగన్ ఇలా గద్దెనెక్కారో లేదో  నానా హడావుడి చేస్తున్నారు. కనీసం ఆయనకు ఆరు నెలల సమయం కూడా ఇవ్వలేదు. మే  30న జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి అటు తెలుగుదేశం, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ మొదలెట్టేశారు .   ఓ విధంగా చెప్పాలంటే జగన్ అధికారంలోకి రాడు అని వీరంతా అనుకున్నారు. కానీ జగన్ అధికారంలోకి రావడం జరిగిపోయింది. బలవంతంగా ఈ చేదు నిజం మింగాల్సివచ్చింది.   ప్రతిపక్ష నేతగా  చంద్రబాబు మాస్టర్ మైండ్ జోరుగా పనిచేస్తోంది. దానికి తగినట్లుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిపోతున్నారు. ఇక ఈ పోటీలో ఓ వైపు వామపక్షాలు ఉంటే, మరో వైపు బీజేపీ కూడా రెడీ అంటోంది.


జగన్ చేతిలో అధికారం చిన్నపిల్లవాడి చేతిలో బెల్లం ముక్కలా భావిస్తున్నాయి విపక్షాలు. దాన్ని ఎలాగైనా కొట్టేయాలని అనుకుంటున్నాయి. వారికి ఇసుక ఇపుడు ఆయుధంగా కనిపిస్తోంది. నిజానికి ఇసుక కొరతకు కొంతవరకూ వైసీపీ సర్కార్ ప్రధాన కారణం అన్న సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి వస్తూనే పాత ఇసుక విధానన్ని రద్దు చేశారు. దానికి కారణం టీడీపీ మాఫియాను అరికట్టాలనే. ఇది మంచి పరిణామం అయినా కూడా కొత్త ఇసుక పాలసీ కోసం మూడు నెలల సమయం తీసుకోవడం, ఈ లోగా వరదలు రావడంతో వైసీపీ సర్కార్ ఇరకాటంలో పడింది.


దాంతో కాచుకుకూర్చున్న విపక్షాలకు ఒక అస్త్రం దొరికినట్లైంది. ఇసుకపై పోరాటం పేరుతో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు రంగంలోకి దిగిపోయాయి. అదే సమయంలో పవన్ కూడా లాంగ్ మార్చ్ పేరిట ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించారు. విశాఖలో పవన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ కి  జనం బాగానే వచ్చారు. దాంతో వైసీపీ ఇపుడు డిఫెన్స్ లో పడింది. ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి సైతం రివ్యూ చేయాల్సివచ్చింది.


ఎవరు ఏమనుకున్నా ప్రభుత్వం చేయాలనుకున్నా ప్రక్రుతి సహకరించకపోతే ఇసుక అన్నది రాదు. ఇపుడు సరిగ్గా అక్కడే వైసీపీ సర్కార్ లాక్ అయిపోయింది. దాంతో ఇదే అదనుగా ఒక్కో పార్టీ దెబ్బ మీద దెబ్బ వేస్తున్నాయి. ఇసుకతోనే వైసీపీని ముట్టడించేస్తున్నాయి. ఇది ఎలా ఉందంటే పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణసంకటంగా మారిపోయింది. మరి ఈ చిక్కు ముడి విప్పాలంటే వానదేవుడే కరుణించాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: