రాజ‌కీయ నాయ‌కులు సున్నిత‌మైన సంద‌ర్భాల‌లో సైతం రాజ‌కీయాలు చేస్తే ఎలా ఉంటుందో తాజాగా...అత్యంత అమానుషంగా క‌న్నుమూసిన అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ ఉదంతంలో స్ప‌ష్ట‌మ‌వుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన కామెంట్లు చేశారు. తహశీల్దార్ విజయారెడ్డి హత్య జరిగిన తర్వాత నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. వారికి సంఘీభావంగా అందులో పాల్గొన్నారు ఎంపీ కోమటి రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని సీఎం కేసీఆర్ పలుమార్లు చేసిన కామెంట్స్ వల్లే ఇలాంటి దాడి జరిగిందన్నారు. 


అధికారుల్లో 98 శాతం కష్టపడి పనిచేసే వారు ఉంటార‌ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎక్కడో ఒకటి, రెండు శాతమే తప్పు చేస్తుంటారని అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పదేపదే రెవెన్యూ శాఖపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని కోమటిరెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని సీఎం కేసీఆర్ పలుమార్లు చేసిన కామెంట్స్ వల్లే ఇలాంటి దాడి జరిగిందని వ్యాఖ్యానించారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ విజయారెడ్డి చాలా నిబద్ధతతో పనిచేసేవారని.. అలాంటి ఉద్యోగిపై దాడి జరగడం బాధాకరమని ఎంపీ కోమ‌టిరెడ్డి అన్నారు. ప్ర‌భుత్వం ఏ కార్యక్రమం జరిగినా విజయారెడ్డి ప్రతి గ్రామంలో తిరిగి మంచిగా పని చేసిన అధికారి అని చెప్పారాయన. తనకు ఆమె పనితీరు గురించి తెలుసని అన్నారు. 

కాగా, త‌హ‌శీల్దార్ దారుణ హ‌త్య‌ గురించి తెలియగానే భారీ సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్విజయవాడ హైవేపై బైఠాయించారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వారికి సర్దిచెప్పి.. నిరసన విరమింపజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: