తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గడువులోగా విధుల్లో చేరని కార్మికులను ఎట్టిపరిస్థితులలోను విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అర్ధరాత్రిలోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని మిగిలిన 5 వేల బస్సులకు కూడా ప్రైవేట్ పర్మిట్లు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పు మరో విధంగా ఇస్తే ఆర్టీసీ యాజమాన్యం లేదా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళతాయని ప్రభుత్వం హెచ్చరించింది. 
 
కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వినియోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా...? ఇచ్చిన అవకాశం వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలను ఇబ్బందులపాలు చేయడమా..? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. సీఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో మంత్రి అజయ్ కుమార్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు మిగిలిన రూట్లలో ఇచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
న్యాయ నిపుణులు సమ్మె విషయంలో ప్రభుత్వానికి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదని హైకోర్టు తీర్పు మరో విధంగా ఉంటే ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళుతుందని చెబుతున్నారు. విచారణ సుప్రీం కోర్టుకు వెళితే కేసుల విచారణ సంవత్సరాల తరబడి సాగుతుందని అంతం లేని పోరాటమవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అర్టీసీ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ హైదరాబాద్ లో పనిచేసే కార్మికులు ఈడీ లేదా బస్ భవన్ లో లేఖలు అందించవచ్చని తెలిపారు. 
 
విధుల్లో చేరే వారికి అన్ని రకాల రక్షణ కల్పిస్తామని వివిధ కార్యాలయాల్లో మంగళవారం సమర్పించిన లేఖలన్నీ హైదరాబాద్ చేరుకుంటాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరాలనుకునే కార్మికులు ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో, డీవీఎం కార్యాలయల్లో సంసిద్ధత తెలుపుతూ లేఖ ఇవ్వవచ్చని తెలిపారు. కార్మికులు విధుల్లో చేరటానికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: