తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు నుంచి స్థాయి లీడర్ల వరకు ఏదో తెలియని భయం మొదలైంది. అసలు రాజకీయాల్లో ఉండాలా ? వద్దా ? రాజకీయాల్లో ఉంటే టీడీపీని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీని నడిపించగలమా ? చంద్రబాబు తన తీరు మార్చుకోకపోతే జగన్ ఇదే దూకుడు కొనసాగితే 2024 ఎన్నికల్లోనూ టిడిపికి ఎంత మాత్రం గెలిచే స్కోప్ ఉండ‌ద‌ని... అస‌లు అప్ప‌టి వ‌ర‌కు పార్టీ ఉంటుందా ? అన్న సందేహం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.


ఈ క్రమంలోనే ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు.. మొన్న‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు పార్టీ మారిపోగా వచ్చే సంక్రాంతి తర్వాత జిల్లా స్థాయిలో కీలక నేతలు కూడా అయితే అటు వైసిపిలోకి లేదా బీజేపీలోకి వెళ్లి పోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లోకేష్‌ని ముందు పెట్టి చంద్రబాబు రాజకీయం చేస్తే పార్టీకి ఎప్పటికీ భవిష్యత్తు ఉండదన్నది ఆ పార్టీ అగ్రనేతల‌కు అర్థమైంది. ఇక వంశీ ఎపిసోడ్ తర్వాత ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు ఎవరు ? బయటకు వెళ్లే ఎమ్మెల్యేలు ఎవరు ? అన్నది చంద్రబాబు అత్యంత రహస్యంగా తనకు నమ్మకస్తుడైన వాళ్ళ చేత ఆరా తీస్తున్నారట.


ఈ ఆరాలో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు సరైన టైం చూసుకుని పార్టీ మారి పోదాం ? అన్న ఆలోచనలో ఉండటం ఒకషాక్‌ అయితే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా ఉండటం డబుల్ షాక్ అని తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వంశీని పక్కన పెడితే మిగిలిన 22 మంది ఎమ్మెల్యేల్లో కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా యాక్టివ్‌గా లేని పరిస్థితి. మొన్న‌ ధర్నాకు పిలిపిస్తే నలుగురు ఎమ్మెల్యేలు కూడా ధర్నాలో పాల్గొన‌ లేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంతో పార్టీ కీలక నేతల్లో సైతం కలవరం మొదలైంది.


ఇటు 13 జిల్లాల‌కు 13 జిల్లా అధ్య‌క్షులు ఉన్నారు. కానీ వారు కూడా చురుగ్గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో అక్క‌డ‌క్క‌డా పార్టీ కార్య‌క్ర‌మాలు క‌నిపిస్తున్నాయి. కానీ మిగ‌తా జిల్లాల్లో ఎక్క‌డా నేత‌లు బయటకు రావ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావడం లేదు. దాదాపు 40 మంది దాకా మాజీ మంత్రులు ఉన్నారు. వీరిలో అరడ‌జ‌ను మంది మాత్రమే మీడియాలో యాక్టివ్‌గా క‌నిపిస్తున్నారు.


దాదాపు సగానికిపైగా నేతలు చంద్రబాబుని నమ్మి పార్టీలో ఉండేందుకు ఎంతమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. మహా అయితే మరో ఒకటి రెండు సంవత్సరాలు వెయిట్ చేద్దాం.. అప్పటికి పార్టీ పుంజు కోక‌పోతే మనం చూసుకుందాం అన్న ఆలోచనలో ఆ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా టిడిపి భవిష్యత్తుపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేకపోవడంతో వాళ్ళందరూ ఎప్పుడైనా అధినేతకు షాక్ ఇచ్చేందుకు రెడీ గా ఉన్న మాట వాస్తవం.



మరింత సమాచారం తెలుసుకోండి: