ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ఉత్కంఠ స్థితికి చేరుకుంది. ఈ రోజు అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని కార్మికులను ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడంద్వారా అవకాశం కల్పించినట్లయిందని, దానిని ఉపయోగించుకొని ఉద్యోగాలు కాపాడుకోవడమా? వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలను కూడా ఇబ్బందులపాల్జేయడమా? అన్నది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. . గడువులోగా కార్మికులు విధుల్లో చేరకపోతే.. మిగిలిన ఐదువేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని.. అప్పుడిక తెలంగాణలో ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టంచేసింది.  దీంతో, కార్మికులు, సంఘాల నేత‌ల నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. 


ఆర్టీసీ సమ్మె...హైకోర్టులో విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. సమ్మె విషయంలోనూ, కోర్టు విచారణ సందర్భంగా  ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చించారు. కార్మికచట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు. న్యాయనిపుణుల సలహాను కూడా తీసుకున్నారు. హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి, యూనియన్ నాయకులు కార్మికులను మభ్య పెడుతున్నారన్నారు సీఎం కేసీఆర్. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో కోర్టు.. ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదన్నారు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదన్నారు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సుప్రీం కోర్టుకు వెళుతుందన్నారు. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే, అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో నెలల తరబడి, ఒక్కోసారి సంవత్సరాల తరబడి కేసుల విచారణ సాగుతుందన్నారు. దాంతో ఆర్టీసీ కార్మికులది అంతంలేని పోరాటం అవుతుందే తప్ప ఒరిగేదేమీ ఉండని సీఎం కేసీఆర్ అన్నారు.


కాగా, సీఎం కేసీఆర్ మాటలకు భయపడే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆయా కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా వివిధ డిపోల వ‌ద్ద కార్మికులు ఏర్పాటు చేసిన నిరసన, ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువును లెక్కచేయమని, తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించే వరకూ సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: