దేశం అంతా ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాస్పద కేసు తీర్పు ఈ నెల 18వ తేదీ లోపు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుంది. మొత్తం 15 పారామిలటరీ కంపెనీలను యూపీకి పంపించారు. నవంబర్‌ 18 వరకు కేంద్ర బలగాలు యూపీలో మకాం వేయనున్నాయి.  ఇప్పటికే యూపీ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేయగా, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం యొక్క 4 వేల మంది సాయుధ బలగాలు మోహరించనున్నారు. యూపీలో మొత్తం 12 జిల్లాలను సమస్యాత్మక జిల్లాలుగా గుర్తించారు. వారణాసి, అయోధ్య, కాన్పూర్‌, అలీఘర్‌, లక్నో, అజంఘర్‌ ప్రాంతాల్లో నిఘా పెంచారు. 


మ‌రోవైపు అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీలో ఉగ్రవాదులు అలజడి సృష్టించే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలను కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. నేపాల్‌, బంగ్లాదేశ్‌ నుంచి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. మూడు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో అలజడి సృష్టించే కుట్రతో ఉన్నట్లు సమాచారం. ఉగ్ర ముప్పు పొంచి ఉందని… అలర్ట్ గా ఉండాలని మూడు రాష్ట్రాలకు ఐబీ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో ఏడుగురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం.  అయోధ్య, ఫైజాబాద్‌, గోరఖ్‌ఫూర్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం. 


ఇదిలాఉండ‌గా, మరో పది రోజుల్లో అయోధ్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో నేతలు నోరు జారొద్దని, వివాదస్పద వ్యాఖ్యలు చేయోద్దని ఆయా పార్టీల పెద్దలు సూచిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కార్యకర్తలకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు అయోధ్యపై తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకునే దాకా.. నేతలు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదన్నారామె. అయితే ఆర్టికల్‌ 370రద్దు తరువాత కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించిన తీరును దృష్టిలో పెట్టుకుని ప్రియాంకగాంధీ ఈ స్టేట్‌ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: