త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య, ఆమె అంత్య‌క్రియ‌ల ఉదంతంలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తహసీల్దార్‌ విజయారెడ్డి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న ఉద్యోగులు...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలతో ఎమ్మారో విజయ రెడ్డి అంతిమ యాత్ర సాగ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ ఉన్మాది అగయిత్యానికి కేసీఆర్ సంబంధం అంట‌గ‌ట్టి ఇలా వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. కాగా, అంతిమ యాత్రలో చనిపోయిన వ్యక్తికి కేసీఆర్ వైఖరే కారణం అనేలా ప‌లువురు వ్య‌వ‌హ‌రించ‌డాన్ని కొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు. 


ఇదిలాఉండ‌గా, తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఖండించారు. అత్యంత దారుణమైన ఘటనను అందరం ఖండించాలని రెవెన్యూ ఉద్యోగులకు సోమేశ్‌ కుమార్‌ సూచించారు. అధికారుల భద్రతకు ప్రభుత్వం, మనం అన్ని రకాల చర్యలు తీసుకుందామన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో కలెక్టర్లు మాట్లాడి వాళ్లకు భరోసానివ్వాలి. అధికారులకు, ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేలా చూడాలి అని కలెక్టర్లకు సోమేశ్‌ కుమార్‌ సూచించారు. ఈ మేర‌కు కలెక్టర్లకు సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.


మ‌రోవైపు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  రెవెన్యూ డిపార్ట్ మెంట్ పై  సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే రెవెన్యూ ఉద్యోగులు చులకనయ్యారన్నారు. అధికార పార్టీ నేతల ఓత్తిడి వల్లే విజయా రెడ్డి హత్యకు గురైందని రేవంత్ ఆరోపించారు. ఈ భూ వివాదంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉందని..సంబంధిత అధికారి చనిపోయి 24 గంటలైనా  ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా విజయారెడ్డి హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు గురవ్వడం దారుణమని, హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విధుల నిర్వహణలో హత్యకు గురైన విజయారెడ్డి  అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. ఈ ఘటనపై ఎలాంటి పోరాటానికైనా కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: