జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌పై త‌న‌పై చేసిన కామెంట్ల‌కు మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. వివిధ అంశాల‌పై ప‌వ‌న్ తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ప‌వ‌న్ ఊపులు, అరుపులకు ఎవరూ భయపడరని క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. ``ఎన్నికలకు రెండు రోజుల ముందు కాకినాడ‌ వచ్చిన పవన్‌.. నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. నన్ను తరిమి తరిమి కొట్టమని పిలుపునిచ్చారు. కానీ ప్ర‌జ‌లు 10 వేల ఓట్లతో ప్రజలు గెలిపించారు. మరి ఎవరిని రెండు చోట్ల ప్రజలు తరిమి తరిమి కొట్టారో అందరికి తెలుసు`` అని ఎద్దేవా చేశారు.


త‌న‌ బతుకు అంతా తెలుసని పవన్‌ అంటున్నారు. త‌నది ఏమైనా రహస్య జీవితమా అని క‌న్న‌బాబు ఎద్దేవా చేశారు. ``నేనేమిటో అందరికీ తెలుసు. నాగబాబు ద్వారా చిరంజీవితో పరిచయం ఏర్పడింది. నా వంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని భావించిన చిరంజీవి టికెట్‌ ఇచ్చారు. 2009లో నేను గెల్చాను. ఆ తర్వాత 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 44 వేల ఓట్లు సాధించాను. 2019లో జగన్‌ టికెట్‌ ఇచ్చి గెలిపించారు. మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ విధంగా నేను ఎప్పటికీ తీర్చుకోలేని రుణగ్రస్తుడిని చేశారు. నేను మంత్రిగా తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా చిరంజీవిని గుర్తు చేశాను. ఆయనే నాకు రాజకీయ జీవితం ఇచ్చారని చెప్పాను. ఇవాళ్టికి కూడా నేను చిరంజీవి గారి ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతాను. నేనూ, పవన్‌ కళ్యాణ్‌ ఒకేసారి 2008లో రాజకీయాల్లోకి వచ్చాం. కానీ ఏనాడైనా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి గురించి మాట్లాడారా?`` అని సూటిగా నిల‌దీశారు. 


ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ పదే పదే విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నారని, అయితే...ఆయనకు, పవన్‌కు పోలిక ఏమిటని క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు. ``విజయసాయిరెడ్డి ఏం చదివారు? పవన్‌ కళ్యాణ్‌ ఎంత వరకు చదివారు? ఆయన సామర్థ్యం ఏమిటి? పవన్‌కు ఉన్న కెపాసిటీ ఏమిటి? విజయసాయిరెడ్డి ఒక నాయకుడిని నమ్మి నిబద్ధతతో పని చేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఆయన పవన్‌ను ఉద్దేశించి దత్తపుత్రుడు అంటే మండిపడుతున్నాడు. పవన్‌కళ్యాణ్‌.. చంద్రబాబుకు దత్తపుత్రుడు కాక మరేమిటి?`` అని వ్యాఖ్యానించారు. గాజువాకలో పవన్‌ను గెలిపించేందుకు, స్వయంగా టీడీపీ అభ్యర్థిని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నించలేదా అని నిల‌దీశారు. ``మంగళగిరిలో లోకేష్‌కు పోటీగా పవన్‌ కళ్యాణ్‌ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ రాజకీయాలన్నీ ఎవరికీ తెలియవా? మీది, చంద్రబాబుది ఫెవికాల్‌ బంధం. ఆ మాట ఎవరన్నా అంటే తిట్టడమే పవన్‌ కళ్యాణ్‌ పని. అంబటి రాంబాబు తన కూతురు పెళ్లికి పిలిస్తే వెళ్లానని పదే పదే చెబుతున్నారు. రాజకీయాల్లో ఉన్న వారు ఎవరైనా ఇంట్లో శుభకార్యం ఉంటే అందరినీ పిలుస్తారు. రాజకీయాలకు అతీతంగా అందరూ హాజరవుతుంటారు. అలా నన్ను కూడా చాలా మంది పిలుస్తారు. నేనూ వెళ్తాను. అలా వెళ్లడం మంచి సంప్రదాయం. అయినా పవన్‌ కళ్యాణ్‌ పదే పదే తాను అంబటి రాంబాబు ఇంట్లో పెళ్లికి వెళ్లానని చెబుతున్నారు. పైగా అంబటి రాంబాబును చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు 1989లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది రాజకీయాల్లో ఆయన సీనియారిటీ. ప‌వ‌న్ సీనియారిటీని అయినా..గౌర‌వించ‌డం మంచిది`` అని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: