రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి స‌జీవ ద‌హ‌నం యావ‌త్తు రెవెన్యూ స‌మాజాన్ని క‌ల‌చివేసింది. రాష్ట్రంలో ఎన్న‌డూ విన‌ని, చూడ‌ని విధంగా అత్యంత దారుణంగా హ‌త్యకు గుర‌య్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ జేఏసీ ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ మ‌రో రెండు రోజులు రెవెన్యూ కార్యాల‌యాలు బంద్ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. అన్ని జిల్లాల  క‌లెక్ట‌రేట్ల ముందు రిలే నిర‌హార దీక్ష‌లు చేప‌ట్టాల‌ని తెలంగాణ రెవెన్యూ జేఏసీ పిలుపునిచ్చింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు భ‌విష్య‌త్తులో జ‌ర‌కుండా,  విజ‌యారెడ్డిని స‌జీవ ద‌హ‌నం చేసిన నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేసింది. 


ప్ర‌భుత్వం నుంచి పై డిమాండ్ల‌పై సానుకూల‌మైన స్పంద‌న వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాం. అప్ప‌టికి ఆశించిన విధంగా స్పంద‌న రాక‌పోతే త‌దుప‌రి భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. డ్రైవర్ గురునాధం కుటుంబానికి రెవెన్యూ ఉద్యోగులుగా ఒకరోజు జీతాన్ని  ఇవ్వనున్నామని ప్ర‌క‌టించింది. బుధ‌వారం నుంచి రెండు రోజుల పాటు జేఏసీ దీక్ష‌లు చేయ‌నుంది.


రెవెన్యూ జేఏసీ ప్ర‌ధాన డిమాండ్లు
1.త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డిని హ‌త్య చేసిన నిందితుడిని క‌ఠినంగా శిక్షించాలి.  స‌జీవ ద‌హ‌నానికి దారి తీసిన అంశాల‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాలి. కుట్ర‌దారుల‌ను గుర్తించి శిక్షించాలి.
2. విజ‌యారెడ్డిని కాపాడే ప్ర‌య‌త్నంలో తీవ్రంగా గాయ‌ప‌డి మృతి చెందిన డ్రైవ‌ర్ గురునాధం తీవ్రంగా గాయ‌ప‌డి మృతి చెందాడు. అత‌డి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వ‌డంతో పాటు ఆర్ధిక స‌హాయాన్ని అందించాలి.
3.విజ‌యారెడ్డి కుటుంబాన్ని ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా ఆదుకోవాలి.
4.రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించాలి.
5.క్యాడ‌ర్ల వారిగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి.
6.పని భారాన్ని త‌గ్గించాలి. ఖాళీ పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాలి.
7.రెవెన్యూ ఉద్యోగ సంఘాల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చించాలి.  
8.రెవెన్యూ శాఖ‌లో ఉన్న సాంకేతిక‌, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం గుర్తించాలి. వెంట‌నే ప‌రిష్క‌రించాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: