ఏంటో అంతా కలసి ఒక్కసారిగా జగన్ మీద  పడిపోతున్నారు. ఇలా పడిపోతున్న వారు ఎవరూ ఏపీకి ఒక్క రూపాయి నిధులు తీసుకువచ్చే వారు కాదు, ప్రజా సంక్షేమం గురించి పట్టించుకునే వారూ కాదు, రాజకీయాల కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శలు  వస్తున్నాయి. అసలు ఏపీ ఏ పరిస్థితుల్లో ఉందో తెలిస్తే ఇలాంటి మాటలు అనే వారే కారేమో. ఏపీ విభజన వల్ల నలిగిపోతున్న రాష్ట్రం, కానీ దాన్ని వదిలేసి కుర్చీల కోసం కొట్టుకునే రాజకీయం మొదలైంది. అది కూడా కేవలం అయిదు నెలల్లోనే ఇలా రాజకీయ వేడి పుట్టించడం దారుణమే.


బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నాయకుడు సుజనా చౌదరి జగన్ విషయాలను  అన్నీ గమనిస్తున్నామని అంటున్నారు. నిశితంగా పరిశీలిస్తున్నామని కూడా చెబుతున్నారు. కేంద్రం చూస్తూ వూరుకోదని కూడా ఆయన హూంకరిస్తున్నరు. ఫిరాయించి మరీ బీజేపీలో చేరిన సుజనా చౌదరి ఎంత అంటే అంత కేంద్రంలోని పెద్దలు వింటారనా ఆయన ధైర్యం. అసలు సుజనాకు బీజేపీలో ఎంతటి స్థానం ఉందో ఎవరికి తెలుసు. రాజ్యసభలో సభ్యులు తక్కువై బీజేపీ గోడ దూకుళ్లను ప్రోత్సహిస్తే  చంద్రబాబు పంపున సుజనా వెళ్ళి ఆ పార్టీలో  చేరారని ఒక పుకార్ ఉంది. మరి అలా  చేరినంతమాత్రం సుజనా ఒక్కరే కేంద్ర ప్రభుత్వం అయిపోరుగా.


ఏళ్ళ తరబడి బీజేపీలో ఉన్నట్లుగా, తానే కేంద్రం అయినట్లుగా సుజనా జగన్ని బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. నియంత పాలన ఏపీలో సాగుతోందట.  ఇవన్నీ చూస్తూ వూరుకోమ‌ని అంటున్నారు. అంటే జగన్ సర్కార్ ని బర్తరఫ్ చేస్తారా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే జనం మళ్ళీ తిరుగుబాటు చేసి అన్న గారికి పట్టం కట్టిన టీడీపీ నుంచే కదా సుజనా పొలిటిక్స్ లోకి వచ్చింది. మరి ఆ మాత్రం ఆయన ఆలోచన చేయలేకపోతున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న.


ఇక దీని మీద బొత్స మాట్లాడుతూ చంద్రబాబు తోకలు  కొన్ని బీజేపీలోకి వెళ్ళి జగన్ని విమర్శిస్తున్నాయని ఘాటుగా కామెంట్స్ చేశారు.  సుజనా లాంటి వారి మాటలను తాము పట్టించుకోమని కూడా బొత్స చెప్పుకొచ్చారు.  ఇక చంద్రబాబుకు మతి పోయిందని, అందుకే బాలల దినోత్సవం వేళ దీక్షలు అంటున్నారని కూడా బొత్స అన్నారు. మొత్తానికి కేంద్రం అంటే తానేనని ఓవరాక్షన్ చేస్తున్న సుజనా విషయంలో బీజేపీ పెద్దలే ఏదో నిర్ణయం తీసుకోవాలేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: