ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం ఒకటి నిర్వహించారు. కరకట్ట మీద ఉన్న నివాసంలో నిర్వహించిన ఈ సమావేశం పూర్తి కాగానే ఆ సాయంత్రానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు అనుకూల మీడియా కొన్ని కథనాలు రాసింది. విభజన హామీలపై ముందుకే వెళ్దామని, ఇందుకు జాతీయ నేతల సహకారం తీసుకుందామని చంద్రబాబు అన్నట్టు మీడియాలో వార్తలు రాసారు. మరుసటి రోజు ఉదయం పెద్ద శీర్షిక పెట్టి సమీక్షా సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను ప్రస్తావించారు.


ఆ రోజు అంత ప్రచారం చేసుకున్న చంద్రబాబు, అధికారంలో ఉన్నప్పుడు పదే పదే కేంద్రం మీద పోరాటం అన్న చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి నోరు కూడా మెదపడం లేదు. అసలు రాష్ట్రం ఆర్ధిక కొరతలో ఉందనే విషయాన్ని మర్చిపోయిన ఆయన... దానికి సంబంధించి కనీసం సీనియర్ నేత హోదాలో ఒక్క లేఖ కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలని మొహమాటానికి కూడా రాయడానికి ఆయన ఇష్టపడలేదు.


బడ్జెట్ ప్రవేశ పెట్టగానే విమర్శలకు దిగిన చంద్రబాబు కేంద్రంపై పోరాటం మాని, పార్టీని బ్రతికి౦చుకునే ఆరాట౦లో ఉన్నారనేది అర్ధమవుతుంది. రాజకీయంగా బలహీనపడిన పార్టీని బ్రతికించుకోవడానికి, కొందరిని కాపాడుకోవడానికి నలుగురిని బిజెపిలోకి పంపించారు అనే విమర్శలు ఇప్ప‌టికే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాను ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నాన‌న్న విష‌యం కూడా మరిచిపోయి పవన్ కళ్యాణ్ తో నిరసనలు చేయించే స్థితికి వెళ్ళారు అనేది అర్ధమవుతుంది.


జగన్ ఢిల్లీ వెళితే ఎద్దేవా చేసే తెలుగుదేశం నాయకులు తమ అధినేత నుంచి ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదనేది కనీసం ఆలోచించడం లేదు. ఈ విష‌యంలో త‌మ పార్టీ అధినేత స్థితి ఏంట‌న్న‌దానిపై వారికి కూడా ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఏది ఎలా ఉన్నా విభజన హామీల విషయంలో చంద్రబాబు పూర్తిగా సరెండర్ అయినట్టే కనపడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: