మొన్నటి విశాఖ లాంగ్ మార్చ్ సభలో పవన్ కల్యాణ్ వైసీపీ మంత్రులు, నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేకించి కొంత మంది పేరు పెట్టి మరీ విమర్శించారు. అందులో మంత్రి కన్నబాబు ఒకరు. ఈ కన్నబాబు ఒకప్పుడు జర్నలిస్టు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవి ఈయన్ను రాజకీయాల్లోకి తెచ్చారు.


ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కన్నబాబు వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు వైసీపీ లో మంత్రి కూడా అయ్యారు. అలాంటి కన్నబాబు గురించి పవన్ చాలా ఘాటుగా మాట్లాడారు. ఏం కన్నబాబు.. మా గురించి మాట్లాడే వాడివయ్యావా.. నిన్ను రాజకీయాల్లోకి తెచ్చిందే మేము.. అంటూ మండిపడ్డారు. దీంతో మంత్రి కన్నబాబు కూడా పవన్ కల్యాణ్ ను ఓ రేంజ్ లో విమర్శించారు.


కన్నబాబు ఏమన్నారంటే.. " పవన్‌ కల్యాణ్‌ సినిమాలు వదిలినా.. యాక్టింగ్‌ వదల్లేదు. పవన్‌ డ్రామాలు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ యాక్టింగ్‌ పండడం లేదు. చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటే పవన్‌కు కోపంతో లాంగ్‌ మార్చ్‌ చేశాడు కానీ, భవన నిర్మాణ కార్మికులపై చిత్తశుద్ధితో కాదని స్పష్టంగా అర్థమవుతుంది.


కార్మికుల సంక్షేమ నిధిని కాజేసిన అచ్చెన్నాయుడిని పక్కనబెట్టుకొని మాట్లాడిన పవన్‌కు కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మాట్లాడితే నీ బతుకు నాకు తెలుసని అంటున్నాడు.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన బతుకులు కాదు ప్రజల బతుకుల గురించి ఆలోచించాలనే కనీసం జ్ఞానం కూడా పవన్‌కు లేదా .. నేను నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన చిరంజీవిని ఇప్పటికీ మర్చిపోలేదు.


కానీ పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి పేరు ఎక్కడైనా ప్రస్తావించాడా..? సినిమాల్లోకి వచ్చినప్పుడు చిరంజీవి తమ్ముడని చెప్పుకున్న పవన్‌ ఇప్పుడు కానిస్టేబుల్‌ కొడుకుని, పోస్టుమెన్‌ మనవడిని అని కొత్తగా బ్రాండింగ్‌ చేసుకుంటున్నాడని మండిపడ్డారు.. మంత్రి కన్నబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: