రాజకీయాలు, ప్రవహించే నీరు ఎపుడూ ఒకేలా ఒకే చోట ఉండవు, ఉండలేవు. అలా ఉంటే అది చప్పగా కూడా ఉంటుంది. ప్రత్యర్ధులను ఉక్కిరిబిక్కిరి చేయాలంటే దూకుడుతో పాటు వ్యూహాలు కూడా అవసరం ఏపీలో రాజకీయ నేతలకు బోలెడు వ్యూహాలు ఉంటాయి. వారు ఎపుడు ఆది చేసినా అందులో  రాజకీయం పాలు ఎక్కువగా ఉంటుందనే జనం కూడా నమ్ముతారు. ఇక బంపర్ మెజార్టీతో గెలిచిన జగన్ ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు. ప్రతిపక్షంలో రాజ‌కీయ గండర గండడు చంద్రబాబు ఉన్నారు. ఆయన ఎత్తులు వేస్తే ఆ స్కెచే వేరుగా ఉంటుందని అంటారు.


ఇసుకను పోగు చేసి పెద్ద రాజకీయం చేసిన చంద్రబాబు చూపు ఇపుడు అమరావతి మీద పడిందని అంటున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఇక రచ్చ ఓ రేంజిలో ఉంటుందని కూడా టీడీపీ సంకేతాలు ఇచ్చేసింది. ఈ రోజు టీడీపీ సీనియర్ నాయకులు అమరావతిలో పర్యటించి వైసీపీ సర్కార్ కి చాలెంజ్ చేశారు. మేము భవనాలు కట్టాం, మీరే మధ్యలో ఆపేశారు అంటూ అచ్చెన్నాయుడు గట్టిగా తగులుకున్నారు. అమరావతి  రాజధానిని కేంద్రం గుర్తించకపోవడానికి వైసీపీ నిర్వాకమే కారణం అని మరో మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు హాట్ కామెంట్స్ చేశారు.


దీనికి కాస్తా ముందుకు వెళ్తే విశాఖలో పవన్ మాట్లాడుతూ రాజధానిని పులివెందులలో పెట్టుకోమన్నారు. అలా మొదలైన టీడీపీ జనసేన రాజకీయ ఆట ఇపుడు అమరావతికి షిఫ్ట్ అయిందన్న మాట. ఇప్పటికి ఇసుక సమస్యతోనే  వైసీపీని టార్గెట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు ఇపుడు అమరావతికి చలో అంటున్నాయి. ఇసుక సమస్య చూస్తే తాత్కాలికమే. అందువల్ల మరో నెల రోజుల్లో కొత్త సమస్య కావాలి. అందుకే అమరావతి రాజధాని విషయంలో జనాల సెంటిమెంట్ కి మంట పెట్టడానికి టీడీపీ  వ్యూహాత్మ‌కంగా పావులు కదుపుతూంటే జనసేన సై అంటోంది. మరి ఈ రాజకీయాన్ని జగన్ వైసీపీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: