చంద్రబాబు అవసరం ఉంటే అమెరికా అయినా వెళ్తారు. లేకపోతే మాత్రం పక్కన ఉన్నా   కూడా  తొంగి చూడరు అని ప్రచారంలో ఉంది. అది ఎంత వరకూ నిజమో తెలియదు కానీ కాలం వేసిన రెండు దశాబ్దాల దూరాన్ని చెరిపేస్తూ హఠాత్తుగా హైదరాబాద్ లో ఉన్న చిన జీయర్ స్వామి వారి ఆశ్రమానికి బాబు ఈ మధ్యన వెళ్లడం జరిగింది. ఈ సీన్ ఫ్లాష్ బ్యాక్ చూస్తే  బాబుకి చిన జీయర్ స్వామికి మధ్య ఆధ్యాత్మిక సమరం అప్పట్లో నడిచింది.


తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని కూల్చ‌వద్దు అని  అప్పట్లో  చిన జీయర్ స్వామి నెత్తీ నోరూ బాదుకున్నా ఉమ్మడి ఏపీ సీఎం హోదాలో బాబు కూలగొట్టేశారు. ఆ తరువాత చిన జీయర్ స్వామి ఆధ్యాత్మిక లోకం వేరు, బాబు రాజకీయాలు వేరు అయ్యాయి. అయిదేళ్ళ పాటు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు కూడా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి కడు సమీపంలో ఉన్న చిన జీయర్ ఆశ్రమానికి ఏనాడూ  పోలేదు. 


ఇపుడు బాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తిరిగి ఆయన అందలం ఎక్కాలి. దాంతో ఆయనలో కొత్త ఆధ్యాత్మిక భావనలు కలుగుతున్నాయని అంటున్నారు. మరో వైపు టీడీపీలో ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చిన జీయర్ భక్తుడు. ఆయన ప్రోద్బలంతోనే  బాబు ఇన్నేళ్ళకు శంషాబాద్ లోని  ముచింతల్ వద్ద ఉన్న చిన జీయర్ ఆశ్రమానికి వచ్చారని చెబుతున్నారు. అక్కడ తిరు నక్షత్ర కార్కక్రమాలు జరుగుతున్నాయి. 


చిన జీయర్ శక్తిమంతుడైన స్వామి అని ఆయన చలువతో కేసీయార్ రెండవమారు తెలంగాణాకు సీఎం అయితే జగన్ ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారని కూడా తమ్ముళ్ళు విశ్వసిస్తున్నారు. బాబు సైతం తన పూర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకు చిన జీయర్ స్వామి వారి ఆశ్రమంలో కాలుమోపి స్వామి పాదాలకు నమస్కరించారు. స్వామి సైతం బాబుని ఆశీర్వదించి ప్రసాదం అందచేశారు. దాదాపుగా రెండున్నర గంటల సేపు బాబు ఆశ్రమంలో గడపడం, చిన జీయర్ బోధనలు వినడం బట్టి చూస్తూంటే టీడీపీ ఓటమి బాబులో ఎంతటి పరివర్తన తెచ్చిందో అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: