గుంటూరు జిల్లా వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇప్ప‌టికే స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీల మ‌ధ్య తీవ్ర విభేదాలు నెల‌కొన్నాయి. ఆధిప‌త్య రాజ‌కీయాలతో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు రేగుతున్నాయి. దీంతో పార్టీ క‌ట్టుబాటు త‌ప్పుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తు న్నాయి. అయితే, ఇవి కొన‌సాగుతుండ‌గానే.. జిల్లాలో మ‌రో సంచ‌ల‌నం తెర‌మీద‌కి వ‌చ్చింది. ఏకంగా ఓ మంత్రిజిల్లా రాజ‌కీయాల‌పైనా, సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పైనా ఆధిప‌త్యం చ‌లాయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో రాజ‌ధాని జిల్లాలో వైసీపీ రాజ‌కీయం ర‌స‌కందాయంగా మారింది.


విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొర‌త వెంటాడుతోంది. ఇక‌, రాజ‌ధాని జిల్లాలో అయితే, ఈ ప్ర‌భావం ఎక్కువ గానే ఉంది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో ఉద్య‌మిస్తున్నాయి. అదికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ప్ర‌భుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలా? అని త‌ల ప‌ట్టుకుంటోంది. అధికారంలోకి వ‌చ్చి ఆరు మాసాలు కూడా గ‌డ‌వ‌క ముందుగానే ఇసుక తుఫాను రేగ‌డం, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుండ‌డంతో తీవ్ర ఇబ్బంది ప‌డుతోంది.


ఇదిలా వుంటే, ఇప్పుడు సీమ‌కు చెందిన ఓ మంత్రి, ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, బంధువు వ‌రుస అయ్యే మంత్రి గుంటూరు జిల్లాలోని ఇసుక రీచ్‌ల‌పై క‌న్నేయ‌డం ఆస‌క్తిగా మారింది. గుంటూరు జిల్లాలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇసుక రీచ్‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. కృష్ణాన‌ది తీరంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గా లు కావ‌డంతో ఇక్క‌డ రీచ్‌ల‌లో ఇసుక ల‌భ్య‌త కూడా బాగానే ఉంటుంది. దీంతో ఇక్క‌డి ఎమ్మెల్యేలు దీనిని ఆధారంగా చేసుకుని అంతో ఇంతో వెనుకేసుకుందామ‌ని అనుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీగానే ఖ‌ర్చు పెట్టి గెలిచిన ఈ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ రీచ్‌ల‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు.


అయితే, ఇంత‌లోనే సీమ‌కు చెందిన మంత్రి ఒక‌రు.. ఈ రీచ్‌ల విష‌యంపై దృష్టి పెట్టారు. స‌ద‌రు ఎమ్మెల్యేల‌కు నేరుగా ఫోన్లు చేసి.. మీరు ఈ రీచ్‌ల జోలికి ఎట్టి ప‌రిస్థితిలోనూ రాకండి.. మీ ప‌ని మీరు చేసుకోండి.. అంటూ.. గ‌ట్టి స్వ‌రంతోనే వారిని ఆదేశించార‌ని తెలుస్తోంది. దీంతో ఈ ప‌రిణామం జిల్లాలో చ‌ర్చ‌కు దారితీసింది. తాము ఎన్నో కోట్ల రూపాయ‌లు ఖర్చు పెట్టుకుని గెలిచామ‌ని, ఇప్పుడు ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బులు లేవ‌ని, ఈ స‌మ‌యంలో ఆ మంత్రి ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం, త‌మ‌పై ఆదేశాలు, ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఈ విష‌యం ఏరంగు పులుము కుంటుందో .. ఏ మ‌లుపుతిరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: