జగన్ సీఎం కావడం ఏపీలోని ప్రతిపక్షాలకు ఇష్టంలేదన్న సంగతి వారి తీరు బట్టే అర్ధమవుతోంది. జగనేంటి సీఎం ఏంటి ఇలా సాగాయి ఎన్నికల ముందు దాదాపుగా అన్ని పార్టీల రాజకీయాలూ, ఆలోచనలూ. ఇక చంద్రబాబు అయితే 2050 వరకూ టీడీపీ అధికారంలో ఉంటుందని గట్టి ధీమాతో ఉండేవారు. కొత్త పూజారి పవన్ అయితే తాను తురుపు ముక్క అవుతానని, మరో కుమారస్వామిలా ఏపీలో హవా చలాయిస్తానని లెక్కలు కట్టుకున్నారు. చివరికి బంపర్ మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చేశారు. విపక్షాలు ఘోర ఓటమిని మూటకట్టుకున్నాయి.  అదే అందరికీ మింగుడుపడని విషయం అయింది.


జగన్ సీఎం అయ్యాక మర్యాదకైనా ఒక్క పార్టీ నాయకుడు కూడా ఇప్పటివరకూ కలవలేదు అంటేనే ఏపీ రాజకీయం ఎంతలా కక్షపూరితంగా సాగుతుందో అర్ధం చేసుకోవాలి. జగన్ గద్దెనెక్కిన తొలి రోజు నుంచే టీడీపీ విమర్శలు లంకించుకుంటే అదే బాటలో జనసేన నడిచింది. ఇక బీజేపీ కూడా జగన్ మీద సెగలూ పొగలూ కక్కుతూ వచ్చే ఎన్నికల్లో  ఏపీలో అధికారంలోకి వచ్చేది తామేనంటూ వీరంగం వేసింది. దాదాపు అయిదు నెలల జగన్ పాలన పూర్తి  అయ్యాక విపక్షాలకు ఒకే ఒక అస్త్రం దొరికింది.


అదే ఇసుక కొరత. దాన్ని పట్టుకుని టీడీపీ తమ్ముళ్ళు ధర్నాలు చేస్తే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ అనేశారు. ఇపుడు చంద్రబాబు ఒక రోజు దీక్ష అంటున్నారు.  మధ్యలో బీజేపీ ఇసుక సత్యాగ్రహం పేరిట మేమున్నామని అంటోంది. ఏదో విధంగా ప్రతీ రోజూ అల్లరి చేస్తూ జగన్ సర్కార్ మీద జనంలో వ్యతిరేకత పెంచి పోషించాలన్నదే ప్రతిపక్షాల పన్నాగంగా కనిపిస్తోంది.  జగన్ ఓ వైపు అన్ని రకాల పధకాలు ప్రవేశపెట్టేస్తున్నారు. వాటిని నిధులు కావాలి. కేంద్రం నుంచి పైసా కూడా రాని పరిస్థితి. ఓ వైపు చూస్తే ఆర్ధిక లోటు ఉంది. మరో వైపు చూస్తే ఖర్చులు పెరిగాయి. ఈ నేపధ్యంలో ఏడాదిలోగా అనుకున్న విధంగా ఆదాయం రాకపోతే జగన్ బాగా ఇబ్బందుల్లో పడతారు. ఈ లోగా జనంలో జగన్ పిచ్చి తుగ్లక్ అని అనుభవశూన్యుడని ప్రచారం చేస్తే చాలు ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. జగన్ని ఎలాగోలా కంపు చేసి పారేస్తే  కాగల కార్యం ఆనక చూసుకోవచ్చునన్నది ప్రతిపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది.


అందుకే బీజేపీ సుజనా చౌదరి కేంద్రం కంట కనిపెడుతోందని బెదిరిస్తారు. ఈ ప్రభుత్వం కూలిపోతుందని పవన్ కళ్యాణ్ జోస్యం చెబుతారు. టీడీపీ తమ్ముళ్ళు అయితే ఎక్కువ రోజులు జగన్ సీఎం గా ఉండరని శాపనార్ధాలు పెడతారు. మరి దీని అర్ధం పరమార్ధం ఏంటి అంటే నలువైపుల నుంచి దాడి చేస్తున్నానమని చెప్పడమే. మరి జగన్ జనాన్నే నమ్ముకున్నాడు, అదే జనంలో జగన్ని బదనాం చేయాలని ప్రతిపక్షం చూస్తోంది. మరి జగన్ దీన్ని ఎదుర్కొనే వ్యూహం ఏంటి సిధ్ధం చేసి ఉంచుకున్నారో.



మరింత సమాచారం తెలుసుకోండి: