ఏపీ సర్కారుపై ఇప్పుడు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నేరుగా పోరాటానికి దిగారు. ఇసుక సమస్యపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక రోజు నిరాహారదీక్షకు దిగుతున్నారు. నవంబర్ 14 ను ముహూర్తంగా నిర్ణయించు కున్నారు. అయితే చంద్రబాబు ఎందుకు ఇంతటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు దీక్షలు జరిపింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఒకరోజు దీక్ష చేశారు.


ఆ తర్వాత ఇటీవలే పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఒక రోజు దీక్ష చేస్తున్నారు. మరి ఇంత జరిగినా ఎందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. దీనికి వైసీపీ నేతలు చెబుతున్న విశ్లేషణ ఒక్కటే.. అదేమిటంటే.. చంద్రబాబు చిన్న కొడుకుతో గుంటూరులో దీక్ష చేయించిన ప్రతిఫలం లేదని, పెద్ద కొడుకుతో విశాఖలో లాంగ్‌ మార్చ్‌ చేయించాడు.. వీరిద్దరితో కూడా ప్రతిఫలం లేదని తానే దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడని ఆ పార్టీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.


నవ నిర్మాణ దీక్ష, ధర్మపోరాట దీక్షల్లాగా మరో హాస్యాస్పద దీక్షకు చంద్రబాబు సిద్ధమయ్యారంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జన్మభూమి కమిటీల కబంధ హస్తాల నుంచి ఇసుకను బయటపడేయాలనే ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ ఇసుకలో నూతన పాలసీ తీసుకువచ్చారన్నారు. పాలసీ అమలు అవుతున్న తరుణంలో ప్రకృతి సహకరించి వర్షాలు విపరీతంగా కురిసి వరదలు వచ్చి నదులు పొంగిపొర్లుతున్నాయన్నారు.


ఇసుక అనే అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ప్రభుత్వ తప్పిదంగా పవన్, చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. దీక్ష చేయడం వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఇసుక కొరత తీర్చేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. నవంబర్‌ 6 రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుందని, ప్రజా సంకల్పయాత్ర రాష్ట్రంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: