జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతల మాటల యుద్ధం ఏమాత్రం తగ్గడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకొని పార్టీ క్యాడర్ అంతా పవన్ పై విరుచుకుపడుతున్నారు. కొందరు సాఫ్ట్ గా రియాక్ట్ అవుతుంటే.. మరికొందరు ఘాటుగా మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ కార్పొరేటర్‌కు ఎక్కవ.. ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.


రెండు చోట్ల ఓడిపోయాననే సిగ్గులేకుండా.. ఎందుకు ఓడిపోయాననే విశ్లేషణ చేసుకోకుండా నూతన ప్రభుత్వంపై మాటలదాడిని పవన్‌కల్యాణ్‌ చేతగానితనం, సినిమా వేషాలకు పరాకాష్టగా భావిస్తున్నామని సుధాకర్‌బాబు అన్నారు. ఈ రోజు వరకు చట్టసభల్లోకి ప్రవేశించింది లేదు కానీ మాటలు కోటలు దాటుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికల్లో వచ్చే కట్టుకథలను ఆధారంగా చేసుకొని పవన్‌ చేసే విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.


ఇసుక కొరతకు కారణాలను విశ్లేషించుకోవడంలో పవన్, చంద్రబాబు విఫలమయ్యారన్నారు.గత ప్రభుత్వం ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేసింది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనాన్ని ఇసుక రూపంలో దోపిడీ దొంగల్లా టీడీపీ నేతలు, స్వయాన చంద్రబాబు కొడుకు దోచేసుకున్నారన్నారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. అలాంటి పరిస్థితిని రూపుమాపి పేదలకు కూడా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నూతన పాలసీ తీసుకువచ్చారన్నారు.


అది అమలు చేస్తున్న క్రమంలో వరదలు వచ్చాయి. ఎక్కడా ఇసుక తీయడానికి అవకాశం లేకపోవడంతో ఇసుక కొరత కొంత ఏర్పడిందన్నారు. ఇసుకపై చంద్రబాబు, పవన్‌ వైఖరి, రాజకీయ విన్యాసాలు చాలా అవమానకరంగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు.2008లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ప్రయాణం మొదలైందని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కచోట ఎన్నికల్లో దాఖలాలు లేవన్నారు.


నిజంగా చట్టాలు తెలిసి ఉంటే పవన్‌ ఇలా మాట్లాడి ఉండేవారు కాదన్నారు. పచ్చపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పవన్‌ మాట్లాడడం సిగ్గుచేటని, పవన్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. స్థాయి తెలుసుకొని పవన్‌ మాట్లాడితే మంచిదన్నారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: