ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణే అవుతుందని ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు అధికారులను హెచ్చరించింది. ఆర్థికశాఖ సమర్పించిన నివేదికలు రెండూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు అధికారులను తప్పుబట్టింది. ఆర్టీసీ సమ్మెపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆర్థిక శాఖ రికార్డులు పరిశీలించిన తరువాతే కోర్టుకు నివేదిక ఇస్తున్నట్లు తెలిపింది. 
 
మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా...? అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు దీనిపై స్వయంగా వివరణ ఇచ్చారు. సమయానుభావం వలన రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని ఆయన తెలిపారు. హైకోర్టును రామకృష్ణారావు మన్నించాలని వేడుకున్నారు. హైకోర్టు వాస్తవాలు చెప్పాలని క్షమాపణ కోరటం సమాధానం కాదని సూచించింది. 
 
మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించటం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. నివేదికలు సీఎం, మంత్రులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. అధికారులు చెబుతున్న వాదనలపై హైకోర్టు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ గతంలో సమర్పించిన నివేదికలో 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. 
 
నిన్న దాఖలు చేసిన అఫడవిట్ లో 450 కోట్ల రూపాయలు ఆర్టీసీనే ఇవ్వాలంటూ అఫడవిట్ దాఖలు చేయటం జరిగింది. ఇప్పటివరకు కేవలం 300 మంది మాత్రమే ఆర్టీసీలో తిరిగి విధుల్లో చేరారని అధికారులు హైకోర్టుకు తెలిపారు. కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం మధ్య సయోధ్యకు హైకోర్టు ప్రయత్నిస్తోందని ప్రభుత్వం, ఆర్టీసీ చిత్తశుద్ధితో ముందుకు రావటం లేదని కోర్టు తెలిపింది.  అధికారులు సమర్పించిన నివేదికల్లోని అంకెలు, లెక్కలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సమస్యను తప్పుదోవ పట్టించటానికి గజిబిజి లెక్కలు, పదాలు వాడారని న్యాయస్థానం అభిప్రాయపడింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 34వ రోజుకు చేరింది.




మరింత సమాచారం తెలుసుకోండి: