పోలవరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో దాఖలైన పిటిషన్ల గురించి ఈరోజు విచారణ జరిగింది. ఎన్జీటీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సభ్య కార్యదర్శి పాండే విచారణకు హాజరయ్యారు. కాఫర్ డ్యాం నిర్మాణంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సంయుక్త కమిటీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. 
 
పోలవరం పునరావసం మొదలైన అంశాలపై ఎన్జీటీ ఈరోజు విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయటంలో ఎందుకు వెనుకంజ వేశారని ఎన్జీటీ ప్రశ్నించింది. సంయుక్త కమిటీలో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్, అటవీ, పర్యావరణశాఖకు సంబంధించిన నలుగురు సభ్యులు ఉండబోతున్నారు. 
 
ఈ కమిటీ కాపర్ డ్యామ్ నిర్మాణం వలన జరిగిన నష్టం గురించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి నివేదికను ఎన్జీటీకి కూడా సమర్పించాలని ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 14వ తేదీకి ఎన్జీటీ వాయిదా వేసింది. పోలవరం ప్రాజెక్ట్ వ్యర్థాల డంపింగ్ పై పెంటపాటి పుల్లారావు పిటిషన్ దాఖలు చేయగా పోలవరం ముంపు ప్రాంతాల ప్రభావంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్ వేశారు. 
 
కేంద్రం ముంపుపై నివేదికను తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు ఇచ్చామని చెప్పగా ఎన్జీటీ పోలవరం అథారిటీని అదే నివేదికను తమకు కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గత నెల 10వ తేదీన జరిగిన విచారణలో ఎన్జీటీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణం ఎలా చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్జీటీ ఎదుట పోలవరం ప్రాజెక్టు సీఈవో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సీఈవో లేకపోవటంతో పోలవరం ప్రాజెక్టు సభ్య కార్యదర్శి బీపీ పాండే ఈరోజు హాజరయ్యారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: