దీర్ఘ‌కాలం త‌ర్వాత‌...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియా ముందుకు వ‌చ్చారు. అయితే, ఆమె మీడియాతో మాట్లాడ‌లేదు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ద్వారా వార్త‌ల్లోకి ఎక్కారు. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్ హోదాలో ఉన్న‌ కల్వకుంట్ల కవిత తాజాగా భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వ్యవస్థాపక దినోత్సవం పుర‌స్క‌రించుకొని నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దోమలగూడలో గల బీఎస్‌జీ పాఠశాలలో నిర్వహించిన ఈ  కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 


గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్స్ నిర్వహణ‌ను ఆమె అభినందించారు. కవిత మాట్లాడుతూ, తోటి వారికి సహాయం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్ధులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రభుత్వం.. విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.విద్యార్థులతో ఆత్మీయ పలకరింపుల అనంతరం స్కూల్‌ ఆవరణలో గవర్నర్‌, కవిత మొక్కలు నాటారు.


ఇదిలాఉండ‌గా, మున్సిపల్‌ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్‌ రానుండడంతో మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో  నిజామాబాద్‌ అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో మళ్లీ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు. రిజర్వేషన్‌లను ప్రకటించిన వెంటనే అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నద్ధాలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా మెజారిటీ స్థానాలను గెలుచుకునే విధంగా వ్యూహాలను రచిస్తున్నా రు. నోటిఫికేషన్‌ రాగానే బరిలోకి దిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలపై అధికార పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కవిత ఆధ్వర్యంలో పలు దఫాలు హైదరాబాద్‌లో చర్చించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: