ఈరోజు హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ జరిగింది. హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఇరువైపు వాదనలు విన్న తరువాత ప్రభుత్వం 11వ తేదీలోపు కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించింది. ఆర్టీసీ అధికారులు మరియు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 
 
హైకోర్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు అసంపూర్ణంగా ఐఏఎస్ స్థాయి అధికారులు నివేదిక ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే కోర్టుకు కూడా అధికారాలు ఉంటాయని ఆ విషయాన్ని విస్మరించొద్దని హైకోర్టు పేర్కొంది. పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హైకోర్టు సమస్య పరిష్కరించకపోతే తామే ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రకటించింది. 
 
హైకోర్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా..? అని ప్రశ్నించింది. హైకోర్టు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ ను స్వీకరించింది. హైకోర్టు రేపు ఈ పిటిషన్ ను విచారించనుంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలను ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా...? అని హైకోర్టు ప్రశ్నించింది. సీజే జస్టిస్ చౌహాన్ ఇంత దారుణంగా తప్పుడు వివరాలను ఇచ్చిన వారిని తన సర్వీసులో చూడలేదని వ్యాఖ్యలు చేశారు. 
 
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికలపై వివరణ ఇచ్చారు. రికార్డుల ఆధారంగా మొదటి నివేదిక రూపొందించామని మన్నించాలని కోరారు. కోర్టు క్షమాపణ కోరడం సమాధానం కాదని వాస్తవాలను చెప్పాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం, ఆర్టీసీ చిత్తశుద్ధితో ముందుకు రావటం లేదని హైకోర్టు ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తోందని హైకోర్టు తెలిపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: