తీర్పు ఎలా ఉంటుందో తెలియదు...ఎవరికి అనుకూలంగా ఉంటుందో తెలియదు..! దేశ వ్యాప్తంగా ఒకటే ఉత్కంఠ...! దశాబ్దాల వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి పరిష్కారం చూపించబోతుందో అన్న ఆసక్తి..! అయోధ్య తీర్పుకు కౌంట్‌డౌన్ మొదలవడంతో యూపీలో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు తీర్పుపై సంయమనం పాటించాలని హిందూ, ముస్లిం సంస్థలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. 


అయోధ్యలో వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమి ఎవరికి చెందుతుంది? అక్కడే రాముడు జన్మించాలని హిందూ సంస్థలు చెబుతుంటే... అది తమ ప్రార్ధనా స్థలమని ముస్లింలు వాదిస్తున్నారు. 40 రోజుల పాటు అన్ని వర్గాల వాదనలు ఉన్న సుప్రీం కోర్టు.... అతి త్వరలోనే అయోధ్యపై తీర్పు వెల్లడించనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్... ఈ నెల 17న పదవీ విరమణ చేస్తుండటంతో...ఆ లోపే తీర్పు రానుంది.. వచ్చే సోమవారం నుంచి శనివారం లోపు ఎప్పుడైనా తీర్పు రావొచ్చు.


సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌కు అదనపు బలగాలను తరలించారు. అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. సోషల్ మీడియాపైనా ఓ కన్నేసి ఉంచారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టేందుకు ఫజియాబాద్ పోలీసులు 16వేల మంది వాలంటీర్లను నియమించారు.  


అయోధ్య పై ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయొద్దని ఇప్పటికే అన్ని పార్టీలు నేతలకు విజ్ఞప్తి చేశాయి. తీర్పు విషయంలో శాంతియుతంగా స్పందించాలని హిందూ, ముస్లిం సంస్థలు విజ్ఞప్తి చేశాయి.  


ఎన్నాళ్లుగానో నలిగిపోతున్న అయోధ్య వివాదానికి కొద్దిరోజుల్లోనే తెరపడనుంది. ఎలాగైనా సరే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనే పట్టుదలతో సుప్రీం కోర్టు ఉంది. ఈ నెల 17న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ పొందుతుండంటతో ఈలోపే అయోధ్యపై తీర్పు రానుంది. ఇదే ఇపుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ముస్లిం, హిందూ సంఘాలు సంయమనం పాటించాలని భక్తులకు పిలుపునిస్తున్నాయి. 





మరింత సమాచారం తెలుసుకోండి: