కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ త‌న‌పై జ‌రిగిన దాడి విష‌యంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో పాల్గొన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మీద పోలీసుల దాడిపై ప్రివిలేజ్ మోషన్‌కు రంగం సిద్ధమైంది. దిల్లీ పర్యటనలో ఉన్న ఎంపీ సంజయ్...గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. పోలీసుల దాడిపై ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు స్పీకర్ కు ఎంపీ సంజయ్ అందచేశారు. గుండె పోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమ యాత్రలో పోలీసుల దౌర్జన్యాన్ని వివరించారు. కార్యకర్తలపైనా జరిపిన దాడిని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటన వివరాలను అడిగి  స్పీకర్ ఓం బిర్లా తెలుసుకున్నారు. ఫోటోలు, వీడియోలు, పత్రిక కథనాలను పరిశీలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశ పెట్టాలని బండి సంజయ్ కుమార్ కోరారు.


ఎంపీ ఫిర్యాదుపై వెంటనే స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ ను ఆదేశించారు. విచారణ త్వరగా ముగించి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. దాడి చేసిన పోలీస్ అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. బండి సంజయ్ తో పాటు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామరసు బాలసుబ్రమణ్యం  స్పీకర్ ను కలిశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన విషయాన్ని స్పీకర్ కు బండి సంజయ్ వివరించారు.


ఇదిలాఉండ‌గా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై పోలీసు దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. కేసు నెంబర్ 1137/36/3/2019 గా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి , తెలంగాణ డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్, దాడి ఘటనలో పాల్గొన్న పోలీస్ అధికారులను ప్రతివాదులుగా పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: