ఆద‌ర్శ‌మైన‌ రాజ‌కీయ‌వేత్త‌గా...ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ముద్ర వేసుకుంటాన‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌క‌టించిన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌....ప‌రిపాల‌న‌లో ఆమేర‌కు వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రాజ‌కీయాల్లోనూ ఆ విధానాన్ని కొన‌సాగిస్తున్నారు. సీపీఎం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర కార్యదర్శి మధును సీఎం జగన్  పరామర్శించిన నేప‌థ్యంలో...ప‌లువురు ఈ అంశాన్ని తెర‌మీద‌కు తెస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకుని తాడేపల్లిలోని త‌న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మధును ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ పరామర్శించారు.  


విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మధు మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఆయన ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఈ నేప‌థ్యంలో...మ‌ధు నివాసానికి స్వ‌యంగా వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ వామ‌ప‌క్ష నేత ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు.  సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మధును పరామర్శించారు. ఈ సందర్భంగా మధుతో వారిద్దరు కాసేపు ముచ్చటించారు. ఈ భేటీలో రాజ‌కీయ అంశాలేవీ చ‌ర్చ‌కు రాలేద‌ని స‌మాచారం.


కాగా, ప్ర‌భుత్వ విధానాల‌పై వామ‌ప‌క్ష నేత‌లు ఆయా సంద‌ర్భాల్లో త‌మ వాద‌న‌ల‌ను మ‌రియు విమ‌ర్శల‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో వైసీపీకి వ్య‌తిరేకంగా జ‌ట్టుక‌ట్టిన విప‌క్షాల్లో సీపీఎం ఒక‌టి. ఆ పార్టీ రాష్ట్ర నేత‌గా మ‌ధు వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. అధికారం చేప‌ట్టిన త‌ర్వాత కూడా ప‌లు అంశాల్లో విబేధించారు. అయిన‌ప్ప‌టికీ..ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అవేమీ మ‌న‌సులో పెట్టుకోకుండా....హుందా రాజ‌కీయవేత్త‌గా మ‌ధు ఇంటికి స్వ‌యంగా వెళ్లి ఆయ‌న యోగ‌క్షేమాల‌ను తెలుసుకున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించడం వామ‌ప‌క్షాల నేత‌ల మ‌న‌సును సైతం గెలుచుకున్నార‌ని ఇంకొంద‌రు ఈ సంద‌ర్భంగా చ‌ర్చించుకుంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: