తూర్పు, ఆగ్నేయ, మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాత్రికి ఒడిసాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ కు ఆగ్నేయ దిశగా 740 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం ఉందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ తుఫాను ప్రభావం అంతగా ఉండదని మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని సమాచారం. రేపటి వరకూ ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఒడిసా బుల్ బుల్ తీవ్ర తుఫానుగా మారనున్న నేపథ్యంలో అప్రమత్తమైంది. 
 
ఒడిసా పైన బుల్ బుల్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తీరప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఇప్పటికే రెండవ ప్రమాద నంబర్ హెచ్చరికను జారీ చేశారు. 
 
అధికారులు మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని బుల్ బుల్ తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని హెచ్చరించారు. కేంద్రం ప్రభావిత రాష్ట్రాలకు బుల్ బుల్ తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు చేసింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కేంద్రం ప్రభావిత రాష్ట్రాలను కోరింది. నిన్న మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం బుల్ బుల్ తుఫాను గురించి జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: