ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై...ఏపీ బీజేపీ మ‌రోమారు ఘాటుగా స్పందించింది.  వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం బోధన నేప‌థ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  లేఖ రాశారు. నిర్బంధ ఇంగ్లీష్ మీడియం బోధన మాతృభాష తెలుగుకు  తీరని అన్యాయమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా  దుందుడుకుగా ఉందని చెప్పడానికి విచారిస్తున్నామ‌ని పేర్కొన్నారు.  కూలంకష చర్చ జరగకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుందన్నారు.


రాష్ట్రాలన్నీ తమ తమ  మాతృభాషలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటే...  ఏపీ ప్రభుత్వం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆరోపించారు. ప్రాథమిక విద్య అంతా మాతృభాషలోనే జరిగితేనే విద్యార్థి లో సృజనాత్మకత పెరుగుతుందని ప్రపంచంలోని విద్యావేత్తలు ముక్తకంఠంతో నినదించారని గుర్తు చేశారు. అయితే, మేధావులు చెప్పిన  దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అందరూ విస్మయం చెందుతున్నారని క‌న్నా త‌న లేఖ‌లో పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం లోకి మారి పోవాలంటే విద్యార్థులకు తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం వరకు లెక్కలు, సైన్స్ సబ్జెక్టులను తెలుగు మీడియంలో చదువుకున్న వారు  ఒక్కసారిగా  ఇంగ్లీష్ మీడియం చదవడమంటే అసాధ్యమేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.


గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు అయితే ఇళ్లల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అనుకూల వాతావరణం ఉండదని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన నిర్బంధ ఇంగ్లిష్ మాధ్య‌మం వ‌ల్ల‌ విద్యార్థుల ఒత్తిడి తట్టుకోలేక పూర్తిగా పాఠశాల మానేసే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని క‌న్నా పేర్కొన్నారు.  ఇప్పటికే అక్షరాస్యతలో, విద్యాప్రమాణాలలో  అంచున ఉన్న ఏపీ మరింత అధ్వాన స్థితికి చేరే ఘంటికలు మోగుతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దశాబ్దాలుగా పాఠశాల ఉపాధ్యాయులు తెలుగులో బోధించి ఒక్కసారిగా ఇంగ్లీషులో మీడియంలో బోధన చేయగలరా అని క‌న్నా సందేహం వ్య‌క్తం చేశారు. ముందస్తు శిక్షణ,  సమయం లేకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు అని ప్ర‌భుత్వాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలని అందరూ కోరుకుంటే వాటికి భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు మండిప‌డ్డారు.  `` ఇలా ఎన్నో ఇబ్బందులు గందరగోళం నేపథ్యంలో రానున్న తరాలు ప్రభావితం చేసే నిర్ణయం పై  ప్రభుత్వం పునరాలోచన చేయాలి.ఏపీలోని కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలను, గ్రామీణ పేద విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం`` అని త‌న లేఖ‌లో క‌న్నా డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: