తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు మ‌ళ్లీ త‌న పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్ రావు గుర్తుకు వ‌చ్చాడని ప్ర‌చారం జ‌రుగుతోంది.! పార్టీ నాయ‌క‌త్వ‌, వార‌స‌త్వ పోరు తెర‌మీద‌కు రావ‌డం, త‌న త‌న‌యుడైన కేటీఆర్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ప్రారంభ‌మైన అప్రాధాన్య‌త ఇప్ప‌టివ‌ర‌కూ కొన‌సాగుతోంద‌ని చ‌ర్చ ఉన్న సంగ‌తి తెలిసిందే. హ‌రీశ్ రావుకు తొలి విడ‌తలో మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో...ఇది నిజ‌మ‌ని అనుకున్నారు. హ‌రీశ్ రావు స్పందిస్తూ, మంత్రి పదవి దక్కనందున తనకు ఎటువంటి అసంతృప్తీ లేదని చెప్పారు. కేసీఆర్‌ ఆదేశాలను క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు. క‌ట్ చేస్తే...ఆయ‌న‌కు రెండో విడ‌త‌లో ప‌ద‌వి ద‌క్కింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే....తాజాగా ఆయ‌న‌కు కీల‌క‌మైన ఆర్టీసీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త అప్ప‌గిస్తార‌ని అంటున్నారు.


ఆర్టీసీ కార్మికుల స‌మ్మె విష‌యంలో...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొండిప‌ట్టు...ఎలాంటి ప‌రిష్కారం చూప‌ని సంగ‌తి తెలిసిందే. హైకోర్టు ఈ విష‌యంలో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది. ``రాష్ట్రానికి పాలకుడు తండ్రయితే.. ప్రజలు పిల్లలు! ఆర్టీసీ విషయంలో పాలకుడు పెద్ద మనసు చేసుకోవాలి. ఆర్టీసీ అంటే 48 వేల మంది ఉద్యోగులు మాత్రమే కాదు. అది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల సమస్య. ప్రజల సమస్యలు పట్టకపోతే ఎట్ల?`` ఇది సాక్షాత్తు హైకోర్టు చీఫ్​ జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్​ చేసిన వ్యాఖ్య‌లు. డ్యూటీలో చేరాలంటూ కార్మికులకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన డెడ్​లైన్​పై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.


ఇలా ముప్పేట త‌న‌పై దాడి జ‌రుగుతున్న త‌రుణంలో...కేసీఆర్ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డ‌ట్లు స‌మాచారం. డ్యూటీలో చేరేందుకు ఇచ్చిన డెడ్​లైన్​కు కూడా ఆర్టీసీ కార్మికుల నుంచి స్పందన రాకపోవడంతో సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఏం చేయాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు. భవిష్యత్ లో ఆర్టీసీ ఏ విధంగా ఉండాలనే దానిపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. మోటర్​ వెహికల్​ యాక్ట్​– 2019 ప్రకారం ఎంతవరకు ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వొచ్చు? సమ్మెలో ఉన్న కార్మికుల విషయంలో ఏం చేయాలి? అనే అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ స‌మ‌యంలోనే...స‌బ్ క‌మిటీ వేసి ప‌రిష్కారం చూపేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. కార్మిక సంఘాల‌ను చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌నే హైకోర్టు ఆదేశం నేప‌థ్యంలో....ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు, ర‌వాణామంత్రి పువ్వాడ అజ‌య్‌, న్యాయ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌రణ్‌ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేత అయిన మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ల‌తో ఉప‌క‌మిటీ వేసి...స‌మ్మెకు ముగింపు ప‌ల‌క‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: