తెలుగుదేశంలో పార్టీలో ఒక ఆసక్తికర పరిణామం కనపడుతూ ఉంటుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న సీనియర్ నేతలు ఇప్పుడు కూడా తమ రాజకీయాన్ని చేస్తూ ఆ పార్టీని బ్రతికించే ఆలోచనలో ఉంటారు. ఒక పక్క చంద్రబాబు రాజకీయంతోనే ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు ఇక నియోజకవర్గాల్లో సీనియర్ నేతల పెత్తనం చూసి చిరాకు పడుతున్నారు. చంద్రబాబు పదే పదే చెప్పుకునే 40 ఏళ్ళ అనుభవం తరహాలో నియోజకవర్గాల్లో ఉండే సీనియర్ నేతలు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు.


ఇటీవల గుంటూరు జిల్లాలో ఒక యువ నేత మాజీ మంత్రి వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పారట. అంతా విన్న సీనియర్ నేత... సదరు యువనేతతో... అలాంటి రాజకీయం పనికి రాదూ అనుభవంతో చెప్తున్నాను, దూకుడు తగ్గిస్తే మంచిది అంటూ యువనేతకు హిత బోధ చేసి పంపించారు. ఆ సోది వినలేని యువనేత... తండ్రి ఇచ్చిన వారసత్వ వ్యాపారాన్ని చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయారు.


ఒక మాజీ మంత్రి గారు అయితే మహిళా ఎమ్మెల్యేని ఎదుర్కోలేక... వైసీపీ నేతలతో స్నేహం చేయడం మొదలుపెట్టి, ఇక్కడి కార్యకర్తలకు అన్నీ నేనే అనే కలరింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే జిల్లాలో సీనియర్ నేతలు అందరూ పార్టీకి పనికొచ్చే పనులు మినహా అన్నీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న కొన్ని మైనింగ్ వ్యాపారాలను కాపాడుకోవడానికి అధికార పార్టీ నేతలతో స్నేహం చేస్తూ వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఇక జిల్లాకు చెందిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణతో ఒకప్పుడు ఉన్న సాన్నిహిత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్లు కూడా త‌మ అవ‌స‌రాల నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల నేత‌ల‌తో లాలూచీ ప‌డుతున్నారు. ఈ విధంగా జిల్లాలో సీనియర్ నేతలు వ్యాపారాలు కొనసాగిస్తూనే... యువనేతలను ఇబ్బంది పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: