మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వ ఏర్పాటులో నెల‌కొన్న అస్థిర‌త కొనసాగుతోంది.  సర్కారు ఏర్పాటుకు తుది గడువు సమీపిస్తున్నా మహాయుతి (మహా కూటమి) పక్షాలు బీజేపీ, శివసేన తమ వైఖరికే కట్టుబడి ఉండటంతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. ప్రభుత్వంలో 50:50 వాటాతోపాటు సీఎం పదవిని చెరో రెండున్నరేండ్లు పంచుకోవాలన్న డిమాండ్‌కే శివసేన కట్టుబడి ఉంది. 

అయితే, ఇదే స‌మ‌యంలో... ఈ అంశం ఎటూ తేలకపోవడంతో ఎమ్మెల్యేలు జారిపోకూడదనే శివసేన క్యాంపు రాజకీయాలకు తెరతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. శివసేన ఎమ్మెల్యేలను బాంద్రాలోని రంగ్‌శర్ధ హౌటల్‌కు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు సంజరు రౌత్‌ ఖండించారు. శివ సైనికులు ఎవరికీ భయపడరనీ, వెన్నుపోటు పొడిచే వారూ కాదని ఆయన తేల్చి చెప్పారు. కూటమిపై తేల్చాల్సింది బీజేపీనేననీ, తాముకాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా వారికి (బీజేపీకి) మెజారిటీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. లేని పక్షంలో తమ మెజారిటీని నిరూపించుకుంటామని ఆయన తెలిపారు.


మ‌రోవైపు తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందనే భయంతోనే శివసేన వారిని హౌటల్‌కు తరలించిందని కాంగ్రెస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ సచిన్‌ సావంత్‌ అన్నారు. దీనిని బట్టి చూస్తే బీజేపీ ఎంత అవినీతిలో కూరుకుపోయిందనే విషయం అర్థమవుతుందని ఆయన చురకలంటించారు. ఇక నేటి నుంచి ముంబయికి సమీపాన ఉన్న ఖండాలా, ఇతర ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా మారుతాయని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి సంజరు ఝా ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే ఉద్ధవ్ నివాసం మాతోశ్రీలో గురువారం జరిగిన శివసేన శాసనసభా పక్షం.. ప్రభుత్వ ఏర్పాటు విషయమై తుది నిర్ణయాధికారాన్ని పార్టీ అధినేతకు అప్పగిస్తూ తీర్మానించింది. తమ పార్టీకి సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకునేందుకు తాము సిద్ధమని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. బీజేపీతో మితృత్వాన్ని తెగదెంపులు చేసుకునేందుకు తాము సిద్ధంగా లేమని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: