ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అటు పాల‌నా ప‌రంగా అనేక సంస్క‌ర‌ణ‌ల‌తో ముందుకు వెళ్ల‌డంతో పాటు ప‌ద‌వుల పందేరంలోనూ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. త‌న‌ను న‌మ్ముకుని ఏళ్ల‌కు ఏళ్లుగా పార్టీలో ఉన్న వారికి ఏదో ఒక ప‌ద‌వి క‌ట్ట‌బెడుతున్నారు. త‌న‌ను న‌మ్ముకున్న వారికి ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలో ఎవ‌రెన్ని అనుకున్నా.. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఎంత మాత్రం లెక్క చేయ‌డం లేదు.


ఇటీవలే టీటీడీ ట్ర‌స్ట్ బోర్డును భారీ నియమాకాలతో నింపేశారు. అనంతరం సాక్షి మీడియా సంస్థకు చెందిన పలువురు ఉద్యోగులను ప్రభుత్వ పోస్టుల్లో నియమించారు. ఈ విష‌యంలో ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా జ‌గ‌న్ ఎంత మాత్రం త‌లొగ్గ‌లేదు. చివ‌ర‌కు తెలంగాణ‌కు చెందిన వాళ్ల‌కు సైతం ఏపీ కోటాలో ప‌ద‌వులు ఇచ్చేస్తున్నారు.


తెలంగాణవాసి దేవులపల్లి అమర్ ను భారీ వేతనంతో ఏపీ జాతీయ మీడియా సలహాదారు బాధ్యతలు అప్పగించారు. అమర్ నియామకంపై విమర్శలు వ్యక్తమైనా జగన్ పట్టించుకోలేదు. సాక్షి మాజీ ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్ కె.రామ‌చంద్ర‌మూర్తిని సైతం ప్ర‌భుత్వ ప‌ద‌విలో భారీ వేత‌నంతో నియ‌మించారు. ఇక తాజాగా దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ స‌తీమ‌ణి నందమూరి ల‌క్ష్మీపార్వ‌తిని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


అలాగే టీటీడీ ఆగమ సలహాదారుగా రమణ దీక్షితులను నియమించారు. బ్రాహ్మణ సామాజికవర్గానికే చెందిన ఎల్వీ సుబ్రమణ్యంను అనూహ్య రీతిలో బదిలీ చేయడంతో ఆ వ‌ర్గం నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే వెంట‌నే వాటికి చెక్ పెట్టేందుకు ర‌మ‌ణ దీక్షితుల‌ను నియ‌మించారు. ఇక పార్టీ కోసం ఏడెనిమిదేళ్లుగా క‌ష్ట‌ప‌డిన కొంద‌రు కీల‌క నేత‌ల‌కు కార్పొరేష‌న్ ప‌ద‌వులను త్వ‌ర‌లోనే క‌ట్ట బెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ట‌. ఇక ఎమ్మెల్సీ ప‌ద‌వులు హామీ ఇచ్చిన వారికి కూడా ఆ ప‌ద‌వుల‌ను ద‌శ‌ల వారీగా ఇవ్వ‌నున్నారు. ఇక రానున్న రెండు మూడు నెల‌ల్లో మ‌రికొంత మంది నేత‌ల‌కు ప‌ద‌వుల పందేరాలు పెద్ద ఎత్తున జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: