అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌న హైద‌రాబాదీ ఆడ‌ప‌డుచు రికార్డు సృష్టించారు. ఒక‌టి కాదు రెండు రికార్డులు ఆ దేశంలో న‌మోదు చేసుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ఘజాల హష్మీ (మున్నీ). వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, తొలి భారత సంతతి మహిళగా అమెరికాలో చరిత్ర సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన హష్మీ రిపబ్లికన్ పార్టీ సెనేటర్ గ్లిన్ స్టర్టివాంట్‌ను ఓడించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు.  ప్రస్తుతం ఆమె రెనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజ్‌లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 


దాదాపు 50 ఏళ్ల‌ కిందట చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడ హ‌ష్మీ స్థిరపడ్డారు. వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయిన సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని స్ప‌ష్టం చేశారు.  `ఈ విజయం నా ఒక్కరిదే కాదు. మీ అందరిదీ.. ఎవరైతే వర్జీనియాలో ప్రగతిశీల మార్పును కోరుకుంటున్నారో.. ఎవరైతే తమ తరఫున గొంతుకను వినిపించాలని నన్ను ఎన్నుకున్నారో వారందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను`` అని తెలిపారు. తుపాకుల సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతానని, విద్య, వైద్యరంగాల అభివృద్ధికి కృషి చేస్తానని హష్మీ చెప్పారు. 


ఘజాల హష్మీ గురించి తెలిసిన ఓ స్థానికుడు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... ``ఆమె నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అందరం ఆమెను మున్నీ అని పిలిచేవాళ్లం. ఆమె వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికకావడం సంతోషంగా ఉంది. గొప్ప సెనేటర్‌గా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాం``అని పేర్కొన్నారు. 


ఇదిలాఉండ‌గా, అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రవాస భారతీయులు సత్తాచాటారు. ఏకంగా నలుగురు ప్రవాస భారతీయులు యూఎస్‌ సెనెట్‌కు ఎన్నికయ్యారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ముస్లిం మహిళతో పాటు వైట్‌హౌస్‌ టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: