దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొంటున్న అయోధ్య‌లో వివాదాస్ప‌ద రామమందిరం మ‌సీదు నిర్మాణం తీర్పు నేప‌థ్యంలో...ప‌రిణామాలు మారుతున్నాయి.  ప్రతిష్టాత్మకమైన కేసులో తీర్పు రానుండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కేంద్రం ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌కు 4వేల మంది సాయుధ బలగాలు పంపించింది. దీంతో పాటుగా పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో అయోధ్య పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. వేడుకలు, నిరసన ప్రదర్శనలపై నిషేధం ఉన్నది. ఇది డిసెంబర్ 28 వరకు కొనసాగనుంది. 


1990లో చెలరేగిన ఘర్షణలు, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, అనంతర పరిస్థితులు, 2010లో హైకోర్టు తీర్పు సందర్భంగా నెలకొన్న ఉత్కంఠ, గత ఏడాది నవంబర్‌లో అయోధ్యలో శివసేన ప్రదర్శన వంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో....స్థానిక ప్ర‌జ‌లు ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. నిత్యావసరాలను, మందులను నిల్వ చేసుకుంటున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులను ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరు వివాహాలు రద్దు చేసుకోవడమో లేదా పెళ్లి వేదికలను జిల్లా అవతలికి మార్చడమో చేస్తున్నారు. అయోధ్య కలెక్టర్ అనుజ్ కే జా మాట్లాడుతూ కొన్ని వారాలుగా హిందూ, ముస్లిం సంస్థల ప్రతినిధులతో, నేతలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. . అయోధ్యలోని స్కూళ్లను తాత్కాలికంగా జైళ్లుగా మార్చాలని, అనుమానితులను వాటిల్లో నిర్బంధించాలనే ప్రతిపాదన కూడా ఉన్నదని పోలీస్ వర్గాలు తెలిపాయి.


మ‌రోవైపు విశ్వ హిందూపరిషత్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. . ప్రస్తుతం నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పనులను మొట్టమొదటిసారిగా మందిర శిల్పాల తయారీని నిలిపివేసినట్టు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు.  వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మి స్తామంటూ వీహెచ్‌పీ 1990లో అయోధ్యలో నిర్మాణ్ కార్యశాలను ప్రారంభించింది. మందిరం ఆకృతిని విడుదల చేసింది. దాదాపు 30 ఏండ్లుగా రాతి శిల్పాలను, ఇతర నిర్మాణాలను రూపొందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: