గత 35 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  నిన్నటి రోజున హై కోర్టులో వాదనలు జరిగాయి.  ఈ వాదనలు జరిగిన సమయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఆర్టీసీ బకాయిలు, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల గురించి, ఆర్టీసీ విభజన గురించి ప్రశ్నించే సమయంలో .. విభజన విషయం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పడంతో.. కేంద్రం అనుమతి ఇవ్వకుండా టిఎస్ఆర్టిసి ఎలా ఏర్పడిందని ప్రశ్నించారు.  దీనిపై ప్రభుత్వం కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.  


అటు కేంద్రం కూడా ఈ విషయంలో గట్టిగా ఉన్నది.  అసలు టిఎస్ఆర్టిసి అన్నది కేంద్రం వద్ద లేదని, తమకు ఏపీఎస్ఆర్టిసి లో మాత్రమే 33 శాతం వాటా ఉందని, ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు కాబట్టి తెలంగాణ ఆర్టీసీకి చట్టబద్దత లేదని కేంద్రం తరపున లాయర్లు హైకోర్టులో వాదించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంతమేర వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది.  ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడం, గతంలో ఇచ్చిన నివేదికకు, నిన్న కోర్టులో ఫైల్ చేసిన నివేదికకు పొంతన లేకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది.  


తప్పుడు లెక్కలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.  దీనిపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 11 వ తేదీకి వాయిదా వేసింది.  ఈనెల 11వ తేదీలోపు కార్మికులతో చర్చలు జరిపి..సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. 11వ తేదీలోపల సమస్య పరిష్కరించక పోతే…తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.  


ఇక ఇదిలా ఉంటె, టిఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదంటున్న కేంద్రం వైఖరితో ఇప్పుడు అసలేం జరుగుతోందో అర్థంకావడంలేదు. రాష్ట్రప్రభుత్వం ఈ ప్రకటనతో సందిగ్ధంలో పడింది. అలాగే కార్మికుల సమ్మె కూడా అయోమయంలో పడింది.  చట్టబద్దత లేకుండా ఇన్నిరోజులు ఆర్టీసీని ఎలా నడిపారు.. చట్టబద్దత లేకుండా ఆర్టీసీలో ఉద్యోగాలు ఎలా కలిపించారు.  చట్టబద్దత లేకుండా సమ్మె ఎలా చేస్తున్నారు అనే ప్రశ్నలు అనేకం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నాయి.  కేంద్రంతో కూర్చొని కెసిఆర్ చర్చిస్తేనే ఈ సమస్యలు పరిష్కారం కావు. కెసిఆర్ పట్టుదలకు పొతే ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: