కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీ తహశీల్దార్ హసీనా బీ సురేశ్ అనే రైతును భూ వివాదం పరిష్కరించటం కొరకు ఏకంగా 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. న్యాయంగా చేయాల్సిన పనికి ఏకంగా 5 నెలల పాటు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంది. నేను రైతునని 8 లక్షల రూపాయలు ఇచ్చుకోలేనని సురేశ్ చెప్పాడు. ప్రస్తుతం గూడూరు మున్సిపాలిటీలో ఎకరం పొలం 4 లక్షల రూపాయలు పలుకుతోంది. 
 
తహశీల్దార్ హసీనా బీ ఏకంగా నాలుగెకరాల పొలం వివాదాన్ని పరిష్కరించటం కొరకు 8 లక్షలు డిమాండ్ చేసింది. చివరకు 4 లక్షల రూపాయలు ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని చెప్పింది. సురేశ్ 4 ఎకరాల పొలాన్ని ఒక వ్యక్తి నుండి కొన్ని నెలల క్రితం కొన్నాడు. కానీ సురేశ్ అన్నకు సురేశ్ కు గొడవలు కావటంతో ఇద్దరూ కోర్టు వరకు వెళ్లారు. ఆ తరువాత అన్నాదమ్ములు ఇద్దరూ మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకొని కోర్టు ద్వారా క్లియరెన్స్ కాపీ తెచ్చుకున్నారు. 
 
ఆ కాపీని తహశీల్దార్ హసీనాకు ఇచ్చి రెడ్ మార్క్ తొలగించమని కోరగా 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 4 లక్షల రూపాయలకు సమస్య పరిష్కరించటానికి హసీనా ఒప్పుకుంది. తహశీల్దార్ తన బినామీకి కర్నూలు జిల్లా పాణ్యంలో 4 లక్షల రూపాయలు అందించాలని చెప్పింది. న్యాయంగా చేయాల్సిన పనికి డబ్బులను డిమాండ్ చేయటంతో సురేశ్ కర్నూలు జిల్లాలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 
 
ఏసీబీ డీఎస్పీ నాగభూషణం రైతు సురేశ్ నగదు ఇచ్చే సమయంలో హసీనా బినామీ ఉసేన్ భాషాని పట్టుకుని విచారణ చేయగా తహశీల్దార్ తనను పంపిందని చెప్పాడు. ఏసీబీ అధికారులు బినామీ ఉసేన్ భాషను అరెస్ట్ చేశారనే విషయం తెలియటంతో హసీనా బీ పరారైంది. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న హసీనా బీ కోసం గాలిస్తున్నారు. ఏసీబీ అధికారులు గూడూరు తహశీల్దార్ ఆఫీస్ లో నిన్న రాత్రి సోదాలు జరిపారు. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: