సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మ‌రోమారు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత‌కాలంగా త‌న‌దైన శైలిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీపై సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ...వార్త‌ల్లో నిలుస్తున్న ఆయ‌న‌...తాజాగా తెలంగాణ పోలీసుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టీసీ స‌మ్మెపై స్పందించిన జ‌గ్గారెడ్డి ఈ ఎపిసోడ్‌లోకి తెలంగాణ పోలీసుల‌ను లాగారు. గాంధీభ‌వ‌న్‌లో జ‌గ్గారెడ్డి మీడియాతో చిట్ ఛాట్ చేస్తూ...ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు. ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు న్యాయం చేస్తుందని  నమ్ముతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌ బండ్ కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోంద‌ని ప్ర‌కటించారు.


పీసీసీ అధ్య‌క్షుడు ఎన్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులన్నీ ఆర్టీసీ జేఏసీకి మద్దతుగా చలో ట్యాంక్ బండ్ నిర‌స‌న‌లో పాల్గొంటారని జ‌గ్గారెడ్డి వివ‌రించారు.``తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలో నిర్వ‌హించిన‌ మిలియన్ మార్చ్ రీతిలో ...చలో ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్‌ను  సక్సెస్ చేస్తాం`` అని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. ప్రజలు సహకరించి ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండాలని ఆయ‌న కోరారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ముందస్తు అరెస్టులపై జ‌గ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ``ఈ అరెస్టులు...తెలంగాణ పోలీసులు చేస్తున్నారా ..?మహారాష్ట్ర వాహనాలలో వచ్చి  మహారాష్ట్ర పోలీసులు చేస్తున్నారా.?`` అని ఆయ‌న నిల‌దీశారు. `తెలంగాణాలో ప్రజలు ఉండాలా ..ఉండొద్దా?`` అని నిల‌దీశారు. తెలంగాణాలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. 


ప్ర‌భుత్వం చేస్తున్న అన్యాయాల‌ను  ప్రశ్నించే వారిని తెలంగాణ పోలీసులు భయ‌కంపితులను చేస్తున్నారని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. ``ఏకపక్షంగా అరెస్ట్ లు చేస్తున్న పోలీసులారా జాగ్రత్త....ఎల్లకాలం కేసీఆర్ అధికారంలో ఉండరని పోలీసులు గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీ ఎవరు అధికారంలోకి వచ్చినా....ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు కష్టాలు తప్పవు.``అని హెచ్చ‌రించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: