రేపు ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధం అయ్యింది.  దీనికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరింది.  కానీ, పోలీసులు ఈ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.  అనుమతి నిరాకరించినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో కూడా అనుకున్నది చేసి తీరుతామని అంటున్నారు.  మిలీనియం మార్చ్ తరహాలో ట్యాంక్ బండ్ మీద ఈ మార్చ్ ను నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది జేఏసీ.  


అయితే, పోలీసులు మాత్రం ఈ మార్చ్ ను అడ్డుకుంటామని అంటున్నారు.  ఇప్పటికే అనేకమంది ఆర్టీసీ కార్మికులను అడ్డుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు.  ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అయితే, ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి కార్మికులు తరలివస్తున్నారు.  ఈ అర్ధరాత్రి వరకు అందరు హైదరాబాద్ రావాలని జేఏసీ కోరింది.  అనుకున్న విధంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మార్చ్ చేస్తామని, బుద్దుడి సాక్షిగా నడుస్తామని అంటున్నారు జేఏసీ నేతలు.  


గత 35 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా తమకు చెందిన 26 డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.  డిమాండ్లను నెరవేర్చేవరకు తాము సమ్మె నుంచి విరమించేది లేదని అంటున్నారు.  సమ్మె విరమించకుంటే ఉద్యోగాల నుంచి పక్కన పెట్టేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.  ఆర్టీసీ జేఏసీ నేతలు నవంబర్ 9 తేదీన చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరో మిలియన్‌ మార్చ్‌ తరహాలో దీనిని నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ చేపట్టనున్న చలో ట్యాంక్‌బండ్‌కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.  


సమ్మె, భవిష్యత్‌ కార్యచరణపై చర్చించేందకు ఓయూ జేఏసీతో ఈయూ కార్యాలయంలో జరగాల్సిన అత్యవసర సమావేశాన్ని ఆర్టీసీ జేఏసీ రద్దు చేసుకుంది. కార్మికుల అక్రమ అరెస్ట్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ముగ్దుం భవన్‌లో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. రేపు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ట్యాంక్ బండ్ నడవాలని, ఎవరు అడ్డుకున్నా ఆగేదిలేదనై అంటోంది జేఏసీ.  


మరింత సమాచారం తెలుసుకోండి: